సర్వేల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం : డిసిసి

నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభ పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కెసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ అన్నారు. దీంతో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు భయపెడుతున్నారని నిందించారు. వాస్తవాలను కప్పిపుచ్చి గొప్పలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు కారణంగా అవినీతి ప్రణాళిక అమలవుతోందని తాహిర్‌ బిన్‌ అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే నిజాలు దాస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తాము కోరుతుండగా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. దీనికి తోడు కేసులు పెడతామని సిఎం స్థాయి వ్యక్తి బెదిరించడం దారుణమని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూపొందించిన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిందని పేర్కొంటూ దాని ప్రభావం ఎస్సారెస్పీపై పడుతుందన్నారు. విధాన రూపకల్పన లోటుపోట్లు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. రాజకీయ అభద్రతతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకో సర్వే పేరిట కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే వారికి గుణపాఠం తప్పదన్నారు. ఉద్యమం నుంచి పాఠాలు నేర్చుకోకుంటే పతనం తప్పదని పేర్కొన్నారు. తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.