సర్‌ ఛార్జీల వసూళ్లు ఆపండి

వసూలు చేసిన డబ్బు బిల్లులో సర్దుబాటు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ
హైదరాబాద్‌, జూలై 31 : విద్యుత్‌ వాడకందార్లపై సర్‌ఛార్జి విధింపును హైకోర్టు తప్పుబట్టింది. అంతేగాక సర్‌ఛార్జి పెంపు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారంనాడు సూచించింది. అంతేగాక పెంచిన విద్యుత్‌ సర్‌ఛార్జిల వసూళ్లను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఇప్పటివరకు వినియోగదారుల నుంచి సర్‌ఛార్జి పేరిట వసూలు చేసిన సొమ్మును వారి బిల్లుల్లో సర్దుబాటు చేయాలని సూచించింది.
రూ.140కోట్లతో కార్యాచరణ ప్రణాళిక : శత్రుచర్ల
హైదరాబాద్‌, జూలై 31 (ఎపిఇఎంఎస్‌):రాష్ట్రంలో 33శాతం అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు వీలుగా రూ.140కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి 63వ వనమహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం మంత్రి విజయరామరాజు మాట్లాడుతూ మహాత్మాగాంధి వన నర్సరీల ద్వారా 8.50 కోట్లతో, రైతుల ప్రయోజనార్ధం 4.50కోట్లతో టెకు మొక్కలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అడవుల అభివృద్ధితో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకు, ఈ సంవత్సరం రూ.30కోట్లతో ఆదిలాబాద్‌, శ్రీశైలం అడవి ప్రాంతాలను పులుల పరిరక్షణ బఫర్‌ ఏరియాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోని అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని, దీనిని అరికట్టేందుకు స్మగ్లర్లపై 47,739కేసులను నమోదు చేసి 21.38కోట్ల అపరాద రుసుమును వసూలు చేయడంతో పాటు 2,377 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. రాష్ట్ర హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనమహోత్సవాన్ని జిల్లాలో నిర్వహించుకోవడం మంచిదని, ముఖ్యంగా విస్తరిస్తున్న పట్టణీకరణ కారణంగా పచ్చదనం తగ్గుతుందని, దీనిని నివారించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటడం తప్పనిసరన్న నిబంధనను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అదే విధంగా ఎకరానికి కనీసం 20 చెట్లను పెంచేవిధంగా రైతులు చొరవ చూపాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీలు రంగారెడ్డి, జనార్థన్‌ రెడ్డి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎ.రాజెందర్‌, రాజిరెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.శామ్యూల్‌ తదితరులు పాల్గొన్నారు.