సహకార ఎన్నికలకు మరోమారు వాయిదా తప్పదా?
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు చాన్స్ లేనట్లే
ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
హైదరాబాద్,జూలై30 (జనం సాక్షి) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు.
ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. 2013జూన్ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్ జాబితా సిద్ధం చేసి పంపారు. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలకు 2018డిసెంబర్లోనే రాష్ట్ర సహకార కమిషనర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ పక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు.