సహకార చెక్కెర కర్మాగారం తెరిపించేందుకు పోరాటం
టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి
శ్రీకాకుళం, జూలై 20: ఆమదాలవలస సహకార చెక్కెర కర్మాగారం తెరిపించేందుకు పోరాడుతామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. ఆమదాలవలస మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏకైక చక్కెర కర్మాగారం మూసివేతతో ఎంతోమంది కార్మికులు, రైతులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చెక్కెర కర్మాగారాలు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో తమ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందన్నారు. అయితే వైఎస్ పాలనలో రాష్ట్రంలో పలు చెక్కెర కర్మాగారాలు తెరిపించినా ఆమదాలవలస కర్మాగారం ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. సీపీఎం నేత చాపర సుందర్‌లాల్ మాట్లాడుతూ కార్మికులకు, రైతులకు జీవనాధారమైన కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం కనీస ఆలోచన చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ఏకైక కర్మాగారం మూతపడడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు మాట్లాడుతూ కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. ఈ సమావేశంలో టిడిపి ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన రవికుమార్, లోక్‌సత్తా నియోజకవర్గ కన్వీనర్ తమ్మినేని అన్నంనాయుడు, వివిధ పార్టీల నాయకులు కొండయ్య, మోహనరావు, కృష్ణ, రమేష్, సూర్యం, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.