సామాజిక కవితాసారధి సుగమ్‌బాబు.
సాహిత్యాభిమానుల అభిమానాన్ని పొందిన ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియ రెక్కలు. ప్రఖ్యాత కవి ఎం.కె సుగమ్ బాబు రూపొందించిన ప్రక్రియ ఇది. సమాజ జాగృతి కోసం ఆధునిక ఆలోచనలతో, ప్రజాస్వామ్య భావాలతో నిర్మాణమైన ప్రక్రియగా సాహిత్య లోకంలో రెక్కలు ఖ్యాతి పొందింది. ఈ ప్రక్రియలో కవికి పూర్తి స్వేచ్ఛ ఉంది. సరళత, సూటిదనంతో, వస్తు, రూప వైవిధ్యంతో రెక్కలు ఆకట్టుకుంది. సమాజ అభ్యున్నతిని కోరుకుంటూ తక్కువ వాక్యాలలో ఎక్కువ అర్థాన్ని అందించే సాహిత్య నిర్మాణ రూపంగా రెక్కలు పేరొందింది. రెక్కలు ప్రక్రియలో మొత్తం రెండు భాగాలు ఉంటాయి. మొదటి నాలుగు పంక్తులు పక్షి శరీరంగా, చివరి రెండు పంక్తులను రెండు రెక్కలుగా భావించాలి. మొదటి భాగం ఒక సాధారణ ప్రకటనాత్మక వాఖ్యానంగా, రెండవ భాగం అందులోని మామూలు భావాన్ని శిఖరాయమాన స్థితికి తీసుకువెళ్లేదిగా చెప్పవచ్చు. నిత్య జీవిత కోణాలు, అనేక భావాలతో తాత్వికంగా కనిపిస్తూ తెలియని తనం నుండి తెలివిడి తనంలోకి రెక్కను పట్టి తీసుకువెళ్లినట్టు అన్పిస్తుంది.
పదాలు, అక్షర నియమం లేని రెక్కలు ప్రక్రియలో మొత్తం ఆరు పాదాలుంటాయి. ఎంచుకున్న విషయాన్ని బట్టి నాలుగు, రెండు పాదాలుగా ఉంటుంది. కవి స్వేచ్ఛను బట్టి విషయాన్ని ముందుగా చెప్పేదానిని సమర్థించే సిద్ధాంతంతో ముగింపు పలకడమే ఈ ప్రక్రియలోని శిల్ప విశిష్టతగా భావిస్తారు. చివరి రెండు పాదాలు సామాజిక దృష్టితో జీవన సత్యాలతో ఉంటాయి. కవి అనుభవసారంగా రెక్కలకు ఎంతో పేరు వచ్చింది. కొడుకైతే/ కొండలు పిండి కొడతాడా/ ఆడపిల్లంటే అసంతృప్తా/ చిన్న బుద్ధితోనే చిన్నచూపు వంటి ప్రసిద్ధి పొందిన రెక్కలను ఎన్నెన్నో ఉదాహరించవచ్చు. సుగమ్‌బాబు మానవ జీవన కోణాల్ని సృశిస్తూ రాసిన రెక్కలు వింగ్స్ ఆఫ్ హోప్ పేరిట ఆంగ్లంలోకి అనువాదమై అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ఎందరెందరో కవులు సుగమ్‌బాబు మార్గంలో రెక్కలను రాశారు. సమాజ స్పర్శతో తాత్వికంగా, వాస్తవికంగా, ప్రాకృతింగా సాగిన రెక్కలు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన కవితాప్రక్రియ.