సామాన్యుడికి కరెంట్‌ షాక్‌

విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం
హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్‌ షాక్‌ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం మోపనుందా ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇది నిజ మేననిపిస్తున్నది. హైద్రాబాద్‌లోని జూబ్లీహాల్లో శాసన సభా పక్ష సమావేశం ముగిసిన వెంటనే సీఎం పక్కనే ఉన్న మండలి హాల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో డిస్కమ్‌లు 11 వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, దీనిలో 6 వేల కోట్లను ప్రభుత్వం భరిస్తున్నది, మిగతా 5 వేల కోట్ల సర్‌చార్జిల సర్దుబాటును వినియోగదారులు భరించక తప్పదని తెలిపారు. విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు. విద్యుత్‌ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగానే గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) నుంచి గ్యాస్‌ను తీసుకుని, విద్యుదుత్పత్తికి వినియోగిం చనున్నట్లు ఆయన వివరించారు. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, సీఎం చేసిన వ్యాఖ్యలు వినియోగదారులను ఆందోళనపరుస్తున్నాయి. ఇప్పటికే వేలల్లో బిల్లులు చెల్లిస్తున్నామని, మళ్లీ సర్‌ చార్జీలు పెరిగితే లక్షల్లో బిల్లులు కట్టాలా అని మండిపడుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకుండా తమపై భారం మోపడమేందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.