సాయంత్రం 6 నుంచి స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత `కమిషనర్ దినేష్ కుమార్
నెల్లూరు,ఆగస్ట్5( జనంసాక్షి): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రోజురోజుకు నగరవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున నివారణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలపైన నగరంలోని షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశం మందిరంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసు శాఖ, వ్యాపార వర్గాల అసోసియేషన్లు, రెవెన్యూ శాఖ, ఇతర ఉన్నతాధికారులతో గురువారం కమిషనర్ సవిూక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్ నగరంలో వ్యాపించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, వ్యాక్సినేషన్ పక్రియ అమలు తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు తెలిపారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందుల పంపిణీతో పాటు వైద్య చికిత్సను పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారితోపాటు వారికి సవిూపంగా మెలిగిన వారిని గుర్తించి వారికి కూడా వైద్య చికిత్సలు, పరీక్షలు నిర్వహిస్తూ పూర్తిస్థాయిలో కరోనా నివారణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, కమర్షియల్ ప్రాంతాల్లో ప్రజలంతా గుమిగూడకుండా అవసరమైన మేరకు మాత్రమే వ్యాపార కలాపాలు నిర్వహించుకుని, ఇంటికే పరిమితం అవ్వాలని కమిషనర్ సూచించారు. మాస్క్ ధారణతో పాటు, భౌతిక దూరం నియమం, శానిటైజర్ వాడకాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటిస్తూ, దుకాణాల ముఖద్వారాల్లో, వ్యాపార కేంద్రాల్లో కచ్చితంగా శానిటైజర్ లను ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివిటీ 2.5 శాతంగా ఉండగా నగరంలో మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో 4.5 శాతంగా ఉందని తెలిపారు. వ్యాపారులు స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ నగర పాలక సంస్థ నుంచి, పోలీసు శాఖ నుంచి పూర్తి మద్దతు అందజేసి షాపుల మూసివేతకు సహకరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.