సింగపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

సింగపూర్‌, (జనంసాక్షి) : తెలంగాణ నినానాదాలు సింగపూర్‌లోనూ మిన్నంటాయి. పార్టీ ఎన్నారై సెల్‌ కో ఆర్డినేటర్‌ కంతి రమేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సింగపూర్‌ నలుమూలల నుంచి తెరాస కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు. ముందు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ నేతృత్వంలో ఆయన ఆశయాలకు    అనుగుణంగా ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషిస్తూనే, స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడానికి కృషి చేస్తామని, 2014 లక్షంగా 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు గెలుచుకొని తెలంగాణ సాధించేందుకు ముందుకు సాగుతామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ నుంచి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో లండన్‌ ఎన్నారై టి.ఆర్‌.ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ, యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని, స్వీయ రాజకీయ శక్తి తోనే తెలంగాణ సాధ్యమని తెలిపారు. తెలంగాణ ప్రజలు గర్వంపడేలా సింగపూర్‌లో పోరాటం చేస్తున్నారని, వీరందరూ చరిత్రలో మిగిలి పోతారని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు, ఆగుల వినోద్‌, సమ రమణరెడ్డి, గుమ్ముల శివ, మహిపాల్‌రెడ్డి, అశోక్‌, రంజిత్‌, మహేష్‌, మల్లికార్జున్‌, సాగర్‌, రాములు, కాంతయ్య, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.