సింగరేణి జీవో 34 ప్రకారం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
టేకులపల్లి, జూన్ 15( జనం సాక్షి ): కోయగూడెం ఓసి లో దారపాడు గ్రామానికి చెందిన ఎనభై రెండు కుటుంబాలు భూములు కోల్పోయి నిర్వాసితులయ్యారు. నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో 50 కుటుంబాలకు సింగరేణి కంపెనీ లో శాశ్వత ఉద్యోగాలు కల్పించారు . అన్ని అర్హతలు కలిగి ఉన్న మిగిలిన ముప్పై రెండు కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు .ఇల్లందు ఆర్&ఆర్ కాలనీకి చెందిన మాలోత్ దిలీప్ కుమార్ అనే గిరిజన యువకుడు హైకోర్టులో పిటిషన్ చేయడం తో సింగరేణి ప్రాజెక్టుల కోసం డిస్ప్లేస్ అయిన ధారపాడు గ్రామంలో 50 కుటుంబాలకు సింగరేణి కంపెనీ లో శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. మొత్తం 82 కుటుంబాలు ఉద్యోగాలకు అర్హత ఉన్నప్పటికీ కేవలం 50 కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు మిగిలిన 32 కుటుంబాలకు కూడా ఉద్యోగాలు కల్పించి తమను ఆదుకోవాలని సింగరేణి అధికారులకు తమ దరఖాస్తు ద్వారా కోరుకున్నారు. జిల్లా కలెక్టర్ గారి గెజిట్ నోటిఫికేషన్లో తమ పేర్లు నమోదు అయ్యి ఉన్నప్పటికీ, ఉద్యోగాలకు అర్హత ఉన్నప్పటికీ న్యాయంగా తమకు రావలసిన ఉద్యోగాలు సింగరేణి అధికారులు ఇవ్వడం లేదని దారపాడు గిరిజన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఉన్నతాధికారులు కనీసం ఇకనైనా స్పందించి తమకు న్యాయం గా రావలసిన ఉద్యోగాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు ఇర్పా నరేష్, ఇర్పా ఈశ్వరి, కురసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.