సింగరేణి సివిక్ కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మికుల ధర్నా.
బెల్లంపల్లి, నవంబర్ 19, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయం ముందు శనివారం సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు.
రెండు నెలల వేతనాలు, సిఎంపిఎఫ్ చిట్టిలు, సమ్మె కాలం నాటి ఒప్పందాలను అమలు చేయాలని, ఏరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా, సింగరేణి బిల్లులు చేయకుండా తీవ్రమైన జాప్యం చేయడం మూలంగా కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరిగిన వేతనాలకు సంబంధించిన ఏరియర్స్ కూడా ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి గత నాలుగు సంవత్సరాలుగా సి.ఎం.పి.ఎఫ్ కు సంబంధించిన జమ ఖర్చుల స్లిప్పులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నిమార్లు సంబంధిత సింగరేణి అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దున్నపోతు పై వాన పడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత నెలలో 19, రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం, లోపాయకారి ఒప్పందం చేసుకున్న జాతీయ కార్మిక సంఘాలు చర్చల నాటి ఒప్పందాలను సైతం పట్టించుకోకుండా, కమిటీలు వేసి పరిశీలిస్తామన్న మాటకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి యాజమాన్యం కార్మికులతో బానిసలాగా పని చేయించుకోవడం తప్ప వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు చట్టపరంగా కల్పించినటువంటి హక్కులను అమలు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి సివిక్ కాంట్రాక్ట్ కార్మికుల రెండు నెలల వేతనాన్ని వెంటనే ఇవ్వాలని, సీఎం పీఎఫ్ స్లిప్పులు, ఇవ్వాలని, గత 19 రోజుల సమ్మె నాటి ఒప్పందాలను అమలు చేయుటకు పూనుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి చాంద్ పాషా, జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, రీజియన్ నాయకులు ఎన్ కృష్ణవేణి, వెంకటి, సునీత, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు శ్యామ్, అబ్దుల్లా, గణేష్, పద్మా, కరుణ, లక్ష్మి, మరియు రవి, చంద్రకళ, పోసక్క, బుచ్చమ్మ, మైసక్క, లచ్చన్న, రాములు, తదితరులు పాల్గొన్నారు.