సింధు ఆశాకిరణం

4

– ఏపీ సీఎం చంద్రబాబు

విజయవాడ,ఆగస్టు 23(జనంసాక్షి): క్రీడల్లో రాణించే వారికి ఎపి ప్రభుత్వం అండంగా ఉంటుందని సిఎం చంద్రబాబు ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించే వారిని వెన్నుత్టటి ప్రోత్సహిస్తామని అన్నారు. అంతేగాకుండా అమరావతిలో అంతర్జాతీయ క్రీడా సౌకర్యాలతో స్టేడియం తదితరాలను ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌ పతకం సాధించకుండానే వెనుదిరుగుతుందేమో అన్న ఆందోళనలో ఉన్న భారతీయులకు పీవీ సింధు ఆశాకిరణంలా కనిపించిందని చంద్రబాబునాయుడు అన్నారు. ఒలింపిక్స్‌లో దేశ పరువును కాపాడిన క్రీడాకారిణి తెలుగమ్మాయి కావడం గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. సింధును ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దడంలో కోచ్‌ గోపీచంద్‌, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయల ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన సింధు విజయోత్సవ సభలో సిఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సింధును శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.  ముఖ్యమంత్రి అయిన తాను ప్రోటోకాల్‌ను కూడా పక్కన పెట్టి సింధుకు స్వాగతం పలకడానికి కారణం ఆమె సాధించిన ఘనతేనన్నారు. పిల్లలకు స్ఫూర్తి నివ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. రేపటి భవిష్యత్‌ విూ చేతుల్లో ఉందని, విూరే దేశానికి ఆశాజ్యోతులని సిఎంబాలలను ఉద్దేశించి అన్నారు. ఫైనల్లో సింధు దూకుడు చూసి స్వర్ణపతకం సాధిస్తుందను కున్నామని.. ఆ లోటు వచ్చే ఒలింపిక్స్‌లో తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2000 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన కరణం మల్లీశ్వరికి తాను హైదరాబాద్‌లో సన్మానం చేసినప్పుడు గోపీచంద్‌ చిన్న పిల్లవాడని చంద్రబాబు తెలిపారు. మల్లీశ్వరి స్ఫూర్తితోనే గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌లో రాణించి దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ బ్యాడ్మింటన్‌ కోచ్‌గా మారి ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాడని కొనియాడారు. దేశంలో క్రికెట్‌తో సమానంగా అన్ని క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అందుకోసమే తాను గచ్చిబౌలి స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహించినట్లు చంద్రబాబు చెప్పారు. ఆ సమయంలో గోపీచంద్‌ విజ్ఞప్తి మేరకు బ్యాడ్మింటన్‌ అకాడవిూకి ఐదెకరాల భూమి ఇచ్చానని.. అప్పుడు నాటిన విత్తనం.. ఇప్పుడు ఫలాలు అందిస్తోందన్నారు. నిరంతరం శ్రమ, కష్టపడే తత్వమే గోపీచంద్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. దేశంలో క్రీడా రంగానికి వైభవం రావాలంటే ఒలింపిక్స్‌ నిర్వహణ ఒక్కటే మార్గమని తాను 2000 సంవత్సరంలోనే చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు.  క్రికెట్‌ మాత్రమే కాకుండా అన్ని క్రీడలకు ప్రాధాన్యత పెరగాలని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ సిద్ధం కావాలని పిలుపు ఇఛ్ఛారు. చైనా, అమెరికా కంటే ప్రతిభ గల క్రీడాకారులు భారత్‌లో ఉన్నారని, శారీరక క్రీడలు మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒలింపిక్ల్స్‌లో పతకం సాధించకపోయినా బాగా ప్రతిభ కనబరిచాడని కిదాంబి శ్రీకాంత్‌కు కితాబిచ్చారు. ఆయనను కూడా ప్రోత్సహించేందుకు రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న రజినీకి కూడా రూ.25 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. క్రీడలకు కేంద్రంగా అమరావతిని తయారు చేస్తామన్నారు. ఒలింపిక్స్‌ నిర్వహణ వల్ల దేశంలో క్రీడాకారులకు ప్రోత్సాహం దక్కుతుందని.. దీంతో ప్రపంచ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. పతకాలు సాధించిన వ్యక్తులు అకాడవిూలు పెడితే వారి అనుభవంతో క్రీడాకారులను తయారు చేయొచ్చన్నారు. దేశంలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు సరైన ఉపాధి లేకపోవడం వల్లనే క్రీడల పట్ల ఆసక్తి తగ్గుతోందన్నారు. అమరావతిలో ఒలింపిక్‌ క్రీడలు జరగాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారని.. దీనికోసం అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అమరావతిలో 15 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్‌ సిటీలో గోపీచంద్‌ అకాడవిూ ఏర్పాటు కోసం స్థలం కేటాయిస్తామన్నారు. గోపీచంద్‌ సేవలకు గాను ఆంధ్రా యూనివర్శిటీ డాక్టరేట్‌ ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. సింధును ప్రోత్సహించేందుకు రూ.3కోట్ల నగదుతో పాటు అమరావతిలోని స్పోర్ట్‌ సిటీలో వెయ్యి ఎకరాల స్థలం, గ్రూప్‌-1 ఉద్యోగం ఆఫర్‌ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. సింధు కెరీర్‌ ఉన్నతస్థాయికి చేరేందుకు ఏం కావాలన్నా చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం సింధుకు నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఘనస్వాగతంతో పాటు ఘన సన్మానం దక్కింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సిఎం చంద్రబాబుతో సహా మంత్రులు ఘనంగా సన్మానించారు. ఇకపోతే వేదికపై అపురూప ఘట్టం చోటుచేసుకుంది. ఏలూరు టీడీపీ ముఖ్య నేత మాగంటి బాబు సింధుకు, గోపీచంద్‌కు బ్యాడ్మింటన్‌ బ్యాట్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలోనే సింధును అభినందించిన సీఎం చంద్రబాబు ఆమెతో కలిసి కొద్దిసేపు సరదాగా షటిల్‌ ఆడారు. ఉత్సాహంతో గెంతుతూ షటిల్‌ ఆడిన సీఎంను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాల నేతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున సింధుకు రూ.25లక్షలు, గోపీచంద్‌కు రూ.10లక్షల చెక్కును అందజేశారు.  పీవీ సింధు దేశానికి, తెలుగువారికి గర్వకారణమని  మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రియోలో మన పరువు పోతుందని దేశమంతా ఆందోళన చెందుతున్న సమయంలో సిందు మన పరువు నిలబెట్టారని అన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోపీచంద్‌ అకాడవిూకి భూమి ఇచ్చారని.. చంద్రబాబు అప్పుడు చేసిన ప్రయత్నంతోనే ఇప్పుడు దేశానికి ఒలింపిక్‌ పతకం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని తల్లిదండ్రులందరూ సింధును స్ఫూర్తిగా తీసుకుని తమ పిల్లలను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సూచించారు. తెలుగింటి ఆడపడుచైన సింధు ప్రపంచ క్రీడా వేదికపై తెలుగువారికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.