సింహాల రక్షణకు కఠిన చర్యలు

ఫోటోలు తీసినా ఇక నేరమే

గుజరాత్‌ సర్కార్‌ ఆదేశాలు

గాంధీనగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఆసియాటిక్‌ సింహాలను సంరక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రవేశపట్టింది. ఇకపై సింహాలు కనిపిస్తే వాటిని ఫోటోలు తీయడాన్ని కూడా నేరంగా పరిగణించనుంది. వేటగాళ్ల ఉచ్చునుంచి సిహాలనపు రక్షించేందుకు ఈ చర్యలను చేపట్టింది. అడవుల్లో కొందరు ఇలా సింహాలను వధిస్తున్నారన్న సమాచారంతో కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు వెల్లడించింది. సింహాలను ప్రదర్శించే కార్యక్రమాలు ఏర్పాటుచేసినా, వాటిని వాహనాలపై వెంబడించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే అటవీ సంరక్షణ చట్టం 1978 కింద ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని పేర్కొంది.సింహాలను రక్షించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం నాలుగు విభాగాలనుఏర్పాటుచేసింది. కానీ ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే విభాగంగా మార్చనుంది. ‘గుజరాత్‌లో సింహాల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించినా, వాహనాలపై వాటిని వెంబడించినా, వాటి ఫొటోలు తీసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అటవీ శాఖ అధికారులను ఆదేశించాం. వేటాడటం అంటే చంపడమే కాదు. ఓ జంతువును హింసించినా అది వేటే అవుతుంది.’ అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణ్‌పత్‌ వాసవ తెలిపారు.సింహాలు కనిపిస్తే వాటికి మాంసాహారాలు విసరడం, వాటిని వెంటాడటం వంటి ఘటనలు గుజరాత్‌లో ఇటీవల పెరిగాయి. ఈ నేపథ్యంలో వాటిని సంరక్షించుకునేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రుపానీ ఈ నిర్ణయం తీసుకున్నారు.