సిఎం వైఖరివల్లే సమస్యలు : శంకరరావు
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.శంకరరావు మరోమారు ధ్వజమెత్తారు. మంగళవారంనాడు సిఎల్‌పి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఖరి వల్లే రాష్ట్రంలో సమస్యలు పేరుకుపోతున్నాయని విమర్శిం చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి అసమర్ధత వల్ల విద్యుత్ సమస్య తారాస్థాయికి చేరిందని విమర్శించారు. ముందస్తు చర్యలు తీసుకోనందున గ్యాస్ సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తుతుందన్న భావన ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేవలం అధిష్టానం వద్ద మెప్పు పొందేందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నారే తప్ప ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని గ్యాస్ నిక్షేపాలు ఇతర రాష్ట్రాలు తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి కిరణ్, ఆయన మంత్రివర్గం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రిని డిమాండు చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే గ్యాస్ సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. ముఖ్యంగా ఏకీకృత ఫీజు విధానంపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక తప్పుల తడిక అని విమర్శించారు. ఈ నివేదిక వల్ల కాంగ్రెస్ పార్టీకి బీసీలు మరింత దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్‌మెంటు విధానం కొనసాగించాలని డిమాండు చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని తాను గతంలోనే ఎన్నోసార్లు వివరించానని శంకరరావు అన్నారు. అయితే పార్టీలో కంటే ప్రభుత్వంలోనే కోవర్టులున్నారని ఆరోపించారు. అవినీతి మంత్రులందరూ కోవర్టులేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం చేసిన తప్పిదాలను కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిపైకి నెడుతున్నారని శంకరరావు మండిపడ్డారు.