సిద్ధివినాయకుడి ఆలయంలో కేసీఆర్‌ పూజలు

ముంబై,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): ముంబై పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహాశివరాత్రి సందర్భంగా ముంబయిలోని సిద్ధివినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన పుట్టిన రోసు కూడా కావడంతో ఇక్కడికి వచ్చి పూజలు చేశారు. ముంబయి

పర్యటనలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ను కలిసి రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఆయనతో పాటు టిఆర్‌ఎస్‌ నేతలు, ఎంపి వినోద్‌ కుమార్‌ తదితరులు ఆలయానికి వచ్చారు. సిఎం కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా సిద్ది వినాయకుడిని దర్శించుకున్నారని ఎంపి వినోద్‌ తెలిపారు. ఆయన ఇక్కడే ఉండడం వల్ల ఈ అవకాశం కలిగిందన్నారు. కేసీఆర్‌ 61వ పడిలోకి అడుగుపెట్టారు. ఇదిలావుంటే ముంబైలోని రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పుట్టిన రోజు కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా సీఎంకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర నేతలు సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, అధికారులు ఉన్నారు. రాజ్‌భవన్‌లోనే ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, కేసీఆర్‌ భేటీ కానున్నారు. సమావేశంలో ఇరు రాష్టాల్ర మధ్య నిర్మించబోయే ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతో మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్నతో పాటు నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఫడ్నవీస్‌తో ప్రాణహిత -చేవెళ్ల, లెండి, పెన్‌గంగ, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌ చర్చించనున్నారు. మరి కాసేపట్లో భేటీ ప్రారంభం కానుంది.