సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

 

– సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వచ్చే నెల 4 నుండి 7 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ధర్మబిక్షం భవన్ లో జరిగిన సమావేశంలో మహాసభలకు సంబంధించిన కరపత్రంను ఆవిష్కరించి మాట్లాడారు.కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ గడిచిన 8 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలు, ప్రజల జీవన పరిస్థితులను సమీక్షించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభ రూపొందిస్తుందని తెలిపారు.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక కోడును తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు.దేశంలో మతోన్మాద, కులోన్మాద దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగటంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దొరేపెళ్లి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, పట్టణ నాయకులు వెంకటరెడ్డి , మైనార్టీ నాయకులు పాషా తదితరులు పాల్గొన్నారు.