సిరియా నుంచి వలసలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
బాంబుల మోతలతో అట్టుడుకుతున్న సిరియా నుంచి వలసలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పొరుగు దేశాలకు వలస వెళుతున్న శరణార్థుల సంఖ్య ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 2 లక్షలకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపూ 83శాతం ఎక్కువ. హింస అంతకంతకూ పెరుగుతుండడంతో వలసవెళ్ళేవారి సంఖ్య కూడా పెరుగుతోందని గతంలోనే ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజన్సీ తెలిపింది.
యుద్ధ వాతవారణంతో సిరియా నుంచి ప్రజలు భారీ సంఖ్యలో యూరప్‌లోకి ప్రవేశిస్తున్నారు. లిబియా కేంద్రంగా జల మార్గంలో అక్రమంగా యూరప్ కంట్రీల్లోకి ప్రవేశిస్తున్నారు. భారీ నౌకల ద్వారా అక్రమ ఇలాంటి సమయాల్లో జరిగే ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. ఇక భద్రతా బలగాలకు దొరికి పోయి జైళ్లలో మగ్గుతున్న వారు అధికారిక లెక్కల్లోకి రాని మరణాలు కూడా వేలల్లోనే ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే 1308 మంది మరణించారంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఐదేళ్ల క్రితం సిరియాలో ప్రారంభమైన మారణకాండ కారణంగా వలసలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా బతుకు దెరువు కోసం పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లే వారి సంఖ్య ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువగా ఉంటుంది. కానీ సిరియా శరణార్ధుల పరిస్థితి మాత్రం అలా కాదు. అక్కడ అంతర్యుద్ధం కారణంగా ఐదేళ్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అంటూ వలస వెళ్తున్నారు. ఇలా ఇతర దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య ఈ ఐదేళ్లలో 50 లక్షలు దాటినట్లు అంచనా
సిరియాలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా జోక్యం చేసుకున్న తరువాతనే అంతర్యుద్ధం మొదలై లక్షలాది మంది శరణార్థులుగా మారారు. లిబియా, ఇరాక్లలో ఒకప్పుడు సుస్థిర ప్రభుత్వాలు ఉండగా, నాటో దేశాలు పనికట్టుకొని అక్కడున్న రాజకీయ వ్యవస్థలను కూలదోసి అరాచకం సృష్టించాయనే వాదనలు ఉన్నాయి.
సిరియా ఆందోళనలు కాస్త విముక్తి ఉద్యమంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ బుజ్జగింపులకు తలొగ్గకుండా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయడం సైనిక పాలకులకు అసహనం కలిగించింది. అదే సమయంలో నిరసనల్ని అణగదొక్కేందుకు సిరియన్ ఆర్మీ నగరాల్లో కవాతు ప్రారంభించింది. దేశద్రోహుల పేరుతో ఊచకోతలు మొదలు పెట్టింది. నిరసనకారులపై ఎలాంటి హెచ్చరికలు లేకుండానే తుపాకుల గర్జించాయి. దేశంలోని అన్ని నగరాల్లో విద్యుత్, ఆహార సరఫరా నిలిపివేశారు. డారా, హామ్స్, బనియాస్, తలకలాహ్, డమస్కస్ వంటి నగరాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేశారు. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
అయితే అగ్ర రాజ్యం ఎత్తుగడతో సిరియా సంక్షోభం ముదరడంతో …అక్కడి ప్రజలకు ఇక్కట్లు మొదలయ్యాయి. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట బాంబు పేలుళ్లు, దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంతో సిరియా నుంచి బయట పడాలకున్న వేలాది మంది ప్రజలు వలస బాట పడుతున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు అభాగ్యులు ప్రాణాలు విడుస్తున్నారు. యూరప్ దేశాలకు పెరుగుతుండటంతో ఆ దేశాలు వలసదారులను నిలువరించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నాయి. కొన్ని దేశాల్లో అక్రమ చొరబాటు దారులకు కఠిన శిక్షలు వేస్తున్నారు. దాంతో ఎక్కడికి వెళ్లినా శరణార్ధుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి.
అటు ఉన్నదేశంలో ఉండలేక పరాయి దేశంలో నిలువ నీడ లేక సిరియా దేశస్థుల పరిస్థితి దారుణంగా తయారైంది.కట్టుబట్టలతో ఇతర దేశాలకు తరలివెళ్తున్న వారికి ఉపాధి ఉండటం లేదు. పిల్లలకు చదువు చెప్పించే పరిస్థితి లేదు. చాలా మంది కూలీ, నాలీ చేసుకుంటూ దినదిన గండంలా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. సిరియా పౌరులు వలస వెళ్లకుండా నివారించాలని కోరుతోంది.