సిరిసిల్ల అభివృద్దికి కంకణబద్దుడైన కెటిఆర్‌

ఉమ్మడి రాష్ట్రంలో చీకట్లు నింపారు

నేడు తెలంగాణ వెలుగులు చిమ్ముతోంది

ముస్తాబాద్‌ సభలో కెటిఆర్‌

రాజన్న సిరిసిల్ల,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిరిసిల్ల సిరుల ఖిల్లా కావాలన్నదే కేటీఆర్‌ తపన అని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ముస్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగసభకు మంత్రి ఈటల రాజేందర్‌, కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..దేశంలోనే ఆత్మహత్యలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సమైక్య పాలనలో రెండు గంటల కరెంట్‌ కోసం అడుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈటల తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ తోడు దొంగలై మళ్లీ కుట్రలకు తెగబడుతున్నారు. చంద్రబాబు డ్రామాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఈటల అన్నారు. ప్రజలే కథానాయకులై గులాబీజెండాను రెపరెపలాడిస్తరు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణ ఖాయమని ఈటల పునరుద్ఘాటించారు. సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..సమైక్య పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. నిధుల కేటాయింపులో అడుగడుగునా వివక్ష చూపించారన్నారు. నాలుగేళ్లలో సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు తీయిస్తున్నాం. డిసెంబర్‌ 11 తర్వాత పెన్షన్లన్నీ రెట్టింపు అవుతాయని కేటీఆర్‌ వెల్లడించారు. పేదల సంక్షేమం కోసం బ్జడెట్‌లో అత్యధికంగా నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. పెన్షన్‌ తీసుకునే వయస్సును 58 ఏళ్లకు తగ్గిస్తున్నామని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.