సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని
బతుకమ్మ చీరల ఆర్డర్లతో కలిసివచ్చిన కాలం
మంత్రి కెటిఆర్ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం
సిరిసిల్ల,అక్టోబర్1(జనంసాక్షి): బతుకమ్మ చీరలకు ఆర్డర్‌తో సిరిసిల్లలో కార్మికులకు చేతినండా పనిదొరికింది. ఇక్కడి వీవర్స్‌కు పని దొరకడంతో మంత్రి కెటిఆర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల చీరలనేతతో కార్మికులు ఉపాధి పొందారు. టీఆర్‌ఎస్ సర్కారు కృషితో సిరిసిల్లగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.
బతుకమ్మ పండుగకు ఆడ్డబిడ్డలకు చీరలను కానుకగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఇక్కడి నేతన్నల జీవితాలకు భరోసా నిచ్చింది. బతుకమ్మ చీరల తయారితో డబుల్ పగారా రావడంతో మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ రంగ కార్మికులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సిరిసిల్లకు 140 కోట్లతో 3 కోట్ల విూటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్‌ను ఇచ్చింది. మిగిలిన ఆర్డర్లను ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది. ఈ
సారి అలాకాకుండా మొత్తంగా 280 కోట్ల విలువైన 90లక్షల చీరల తయారీ భారీ ఆర్డర్ బాధ్యతలను సిరిసిల్లకే అప్పగించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. గత జూలై నెలలో చీరల తయారీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 72లక్షల చీరలు ఉత్పత్తి కాగా, మిగిలిన 18లక్షల వస్త్రాలను తయారు చేయాల్సి ఉంది. అక్టోబర్ 15లోగా టార్గెట్‌ను పూర్తి చేయాలని లక్ష్యం విధించగా, గడువుకు ముందుగానే పూర్తి చేసి అందించాలన్న సంకల్పంతో కార్మికులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. పండుగకు ముందే ఆడబిడ్డలకు కానుకను అందించే లక్ష్యంతో పని చేస్తున్నారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. విద్యుత్ తదితర రాయితీలను అందిస్తున్నది. మరమగ్గాలను ఆధునికీకరిస్తున్నది. అదే సమయంలో నేతన్నలకు చేతి నిండా పనికల్పించాలని భావించింది. సిరిసిల్ల పట్టణంలో 30వేల మరమగ్గాలున్నాయి. అందులో 19వేల మగ్గాలపై బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. మొత్తం 80రంగుల్లో దాదాపు కోటి చీరల ఉత్పత్తికి 4వేల టన్నుల నూలు, 3వేల టన్నుల జరీ నూలును ముందస్తుగానే చేనేత జౌళీ శాఖ సమకూర్చి పెట్టింది. రోజుకు పది లక్షల విూటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసి వెంటవెంటనే హైదరాబాద్‌లోని ప్రాసెసింగ్ యూనిట్లకు అధికారులు తరలిస్తున్నారు. చీరల తయారీతో మొత్తం 20వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ట్రాన్స్‌పోర్టు, వెల్డింగ్ వర్కర్లను క లుపు కుని దాదాపు 22వేల మంది కార్మికులు బతుకమ్మ చీరల తయారీలో నిమగ్నమయ్యారు. తయారైన చీరలను ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రాసెస్ చేసి ప్యాకింగ్‌లు కూడా సిద్ధం చేస్తున్నారు. అందుకోసం అక్కడ మరో 100 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. బతుకమ్మ పండుగ సవిూపిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తుల్లో వేగం పెంచడంతోపాటు వస్త్ర నాణ్యత ప్రమాణాలను పాటించేలా చూస్తున్నారు. హైదరాబాద్ చేనేత జౌళీ శాఖలో జియో ట్యాగింగ్ చేసిన సాంచాలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజరామయ్యర్ వారంలో నాలుగు రోజులు సిరిసిల్లలో పర్యటించి వస్త్ర ఉత్పత్తుల తీరును పరిశీలించారు. మరో 50 మంది చేనేత జౌళి శాఖ అధికారులను ప్రత్యేకంగా నియమించారు. జిల్లాలో కూడా కలెక్టర్‌తోపాటు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా రు. ఇటీవలే వచ్చిన కలెక్టర్ వెంకట్రామరెడ్డి మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఆసాములు, యజమానులతో సమావేశమై మార్గ నిర్దేశం చేశారు. గతంలో నేత కార్మికులు 8వేలలోపు మాత్రమే వేతనం వచ్చేది. ఇది గిట్టుబాటు అయ్యేది
కాదు. గతేడాది హైదరాబాద్‌లో సిరిసిల్ల మరమగ్గాల యజమానులు ఆసాములతో సమావేశమై, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు, సంక్షేమ పథకాలపై కూలంకషంగా చర్చించారు. కనీసం 15వేల వేతనం వచ్చేలా పని కల్పించాలని భావించారు. అందులో భాగంగానే కోటి బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్లకు ఇచ్చారు. దీంతో నేతన్నలకు చేతినిండా పనిదొరుకుతున్నది. ఒక్కో కార్మికుడికి ప్రతి నెలా 15వేల నుంచి 20వేల దాకా వేతనం వస్తున్నది.