సిరిసిల్ల చేనేత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేశాం

తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్ల తోడుగా నిలిచింది

రాబోయే కాలంలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం

ఆహారశుద్ది కేంద్రాలతో కల్తీలను అరికడతాం

యాదగిరి దేవస్తానంలా వేములవాడ అభివృద్ది

కేటీఆర్‌, చెన్నమనేని రమేశ్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలి

సిరిసిల్ల ఆ శీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ పిలుపు

రాజన్నసిరిసిల్ల,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాతనే ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఆపగలిగామని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు. నేత కార్మికులకు భరోసా కల్పించామన్నారు. అయితే అలాంటి ఘటనలు ఇక పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉద్యమ సమయంలో చైతన్యం కలిగిన ప్రాంతం సిరిసిల్ల అని కేసీఆర్‌ అన్నారు. రాబోయే కాలంలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నారు. సిరిసిల్ల-వేములవాడ నియోజకవర్గాల ఆశీర్వాద సభలో సీఎం కెసిఆర్‌ మాట్లాడుతూ..

తాను కలలు కన్న తెలంగాణ సాకారం కాబోతోందని అన్నారు. ఉద్యమ సమయంలో సిరిసిల్ల వాసులు తన వెంటే ఉన్నారని, 2001లో మొట్టమొదటి సారిగా కరీంనగర్‌ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేశామని గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రానికి ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. అనేక బాలారిష్టాలను అధిగమించి రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతోందన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ రోజు అన్నీ కల్తీమయంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కారప్పొడి, పసుపు, నూనెలు, చివరకు పాలను కూడా కల్తీచేసే దుర్మార్గులు పుట్టుకొచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు. వీరి పీచమణిచేందుకు ఐదారు వ్యవస్థలను సవిూకృతం చేసే అద్భుతమైన పథకాన్నితీసుకొస్తామని భరోసా ఇచ్చారు. సిరిసిల్లలో అపెరల్‌ పార్కు రావాలన్నారు. ప్రతి చేనేత కార్మికుడి నెల జీతం రూ.25వేలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలన్నారు. రైతులు పండించిన పంటలను ఏ ఊరికి ఆ ఊరులోనే అమ్మకాలు అయిపోవాలన్నారు. ఐకేపీ మహిళా గ్రూపులే ఆ ధాన్యం కొనుగోలు చేసేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. ఎక్కడ ఏ పంట ఎక్కువ పండుతుందో దానికి సంబంధించి మహిళా సంఘాలతో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతామన్నారు. ఈ కేంద్రాలను ఐకేపీ మహిళలే నిర్వహిస్తారని చెప్పారు. క్రాంతి, విప్లవం ఆకాశం నుంచో, అమెరికా నుంచో రాదని, మన సమాజం నుంచి మనమే దాన్ని నేర్చుకోవాలన్నారు. ముంబైలోని ధారవిలో ఒక చైతన్యమంతురాలైన మహిళ లిజ్జత్‌ అప్పడాలను తయారు చేసి విజయవంతమయ్యారని చెప్పారు. దేశంలోనే ఆ కంపెనీ రూ.1176 కోట్ల టర్నోవర్‌ చేస్తోందన్నారు. కేసీఆర్‌ తమ పెద్దకొడుకు అని వృద్ధులు అంటున్నారని చెప్పారు. గతంలో బీడీ కార్మికుల కష్టాలను ఎవరూ పట్టించుకోలేదని, తామే వారిని ఆదుకున్నామని అన్నారు. రాష్ట్ర సంపదను పెంచి దాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు.

తెలంగాణ రాకముందు పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై రాష్టాన్రికి వచ్చిన ఆదాయం 9.5 కోట్లు అయితే, తమ నాలుగేళ్ల పాలనలో ఆ ఆదాయాన్ని రూ.2057 కోట్లకు పెంచామన్నారు. దాన్ని పెంచేందుకు తాము మాయలకు పాల్పడలేదని, విచ్చలవిడిగా స్మగ్లింగ్‌ను అరికట్టడం వల్లే దాన్నిసాధించామన్నారు.

భవిష్యత్తులో ఇంకా ఈ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఈ డబ్బుతో ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రామలను అమలు చేస్తామన్నారు. కేసీఆర్‌ ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదని, తాను తెలంగాణ ప్రజల పొత్తుల సద్దిని అన్నారు. తనను అందరూ తినొచ్చని చెప్పారు. తనకు శత్రువులెవరూ లేరని చెప్పారు. సిరిసిల్లలో భవిష్యత్తులో చేనేత కార్మికుల ఆత్మహత్యలు పునరావృతం కావొద్దని సూచించారు. మళ్లీ అధికారంలోకి వస్తే వేములవాడ రాజన్న ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ సీఎం కాకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ జన్మలో అయ్యేది కాదన్నారు. పచ్చని పొలాలతో తెలంగాణ కళకళలాడితే అంతకన్నా గొప్ప కోరిక తనకేవిూ లేదన్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌, వేములవాడలో రమేశ్‌బాబును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 250 ఆహార శుద్ది కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేటీఆర్‌, చెన్నమనేని రమేశ్‌ నేతృత్వంలో అభివృద్ధి పనులు చాలా బాగా జరిగాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ ప్రజలు కేటీఆర్‌, చెన్నమనేని రమేశ్‌ లను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. . కొత్త రాష్ట్రానికి ప్రారంభంలోనే చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నో ఇబ్బందులు అధిగమించి..చాలా గర్వంగా, చాలా సంతోషంగా విూ ముందు ఈ రోజు మాట్లాడుతున్నానని అన్నారు. నాలుగు సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. మంచినీటి రంగంలో 11 రాష్ట్రాల వాళ్లు ఇక్కడకు వచ్చి మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని పరిశీలించి నేర్చుకుని వెళ్లారని సీఎం తెలిపారు. రైతుబంధు విషయంలో ఐక్యరాజ్య సమితి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించి, ఇది ప్రపంచలోనే ఒక మంచి పథకం..అద్భుతమైన పథకమని ప్రశంసించింది. ఈ పథకాన్ని ఏవిధంగా అమలు చేశారో తమకు చెప్పాలని ఐక్యరాజ్యసమితి సభ్యులు కోరారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతుబీమా అందించడం ఇంకా చాలా సంతోషకరమైన విషయమని సీఎం పేర్కొన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయి. నేను కలలు కన్న తెలంగాణ సాకారం కాబోతున్నది. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కెటిఆర్‌, చెన్నమనేని రమేశ్‌, కెకె తదితరులు పాల్గొన్నారు.