సిరిసిల్ల నేతకు పేరు తీసుకుని వస్తా

తిరుపూరుకు వచ్చాఇన ఖ్యాతి రావాలి

ఎన్నికల ప్రచారంలో కెటిఆర్‌

రాజన్న సిరిసిల్ల,నవంబర్‌10(జ‌నంసాక్షి): సిరిసిల్ల వస్త్రాలు దేశవ్యాప్తంగా పేరు గడించేలా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల కాటన్‌ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. చాలా మంది నేతలకు పవర్‌లూమ్‌, చేనేత అంటే ఏమిటో కూడా తెలియదని ఆయన ఎద్దెవా చేశారు. తిరుపూర్‌ అసోసియేషన్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు సిరిసిల్ల పరిశ్రమకు కూడా రావాలని కేటీఆర్‌ అన్నారు. గుజరాత్‌ కాటన్‌ కంటే తెలంగాణ కాటన్‌ బాగుందని ఇప్పటికే కొంత మంది నిపుణులు చెప్పారు. కార్మికులు ఎదిగేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమ కార్మికులకు 8 నెలల పని లభిస్తోంది. కార్మికులు సంఘటితమైతే అనుకున్నది సాధించొచ్చు. సిరిసిల్ల నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేను అయ్యాను. ప్రజల ఆదాయం పెరగాలనేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. పెరిగిన ప్రభుత్వ ఆదాయం ప్రజలకు పునఃపంపిణీ జరగాలనేది కేసీఆర్‌ ప్రధాన ఆశయం. టీఆర్‌ఎస్‌ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని చూపించాం. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలను తక్కువ సమయంలోనే పరిష్కరించుకున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. నేతన్నల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నేతన్నల ఆవేదన తనకు అర్థం అయిందన్నారు. ప్రభుత్వ ఆర్డర్లను వికేంద్రీకరించి ఇస్తే అందరికీ లబ్ది చేకూరుతుందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిన తరువాత సంస్థ అభివృద్ధిపై చర్చిద్దామని చేనేతలను ఉద్దేశించి అన్నారు. సిరిసిల్ల నేతన్నల్లో ఐక్యత పెరగాలన్నారు. ప్రభుత్వ పరంగా మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా సాయం అందించడానికి తాను సిద్ధమన్నారు. నాలుగేళ్ల స్వల్ప కాలంలో సాధ్యమైనంత వరకు విద్యుత్‌, సాగు, తాగు నీరు అందించామని కేటీఆర్‌ చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి

చూపిస్తామన్నారు. సిరిసిల్లలో కాటన్‌ పరిశ్రమను కాపాడుకునేందుకు చర్యలు చేపడతామన్నారు.