సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం..

77వరంగల్ : వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారులు అభినవ్, ఆయోన్‌, శ్రీయోన్‌ సజీవ దహనమయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులు నలుగురూ ఒకేసారి చనిపోవడం ఇటు రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. వీరి మృతి స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

కాగా గతంలో రాజయ్యపై కోడలు సారిక ఫిర్యాదు చేసింది. వీరి మధ్య గత కొంతకాలం కుటుంబకలహాలు ఉన్నాయి. రాజయ్య కుటుంబంపై కోడలు సారిక 498/A కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజయ్య ఇంట్లో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నిజానికి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాతే ఈ సంఘటన జరిగినప్పటికీ, బుధవారం తెల్లవారిన తర్వాత గానీ వెలుగులోకి రాలేదు. మృతి చెందిన నలుగురూ బెడ్ రూమ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సందర్శించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. హత్యా? అగ్నిప్రమాదమా? ఏమైనా కుట్ర జరిగిందా..? అనే కోణాల్లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీక్‌ కావడంతో  ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు.

రాజయ్య వరంగల్‌ లోకసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కాగా నిన్న ఒక సెట్‌ నామినేషన్‌ వేసిన ఆయన…. ఈరోజు మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉంది.  అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో రాజయ్య తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆయన డమ్మి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అభ్యర్థిని మార్చే యోచన చేస్తోంది. అభ్యర్థి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు, అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.