సీఎం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని కలిసినట్లు బుధవారం అలంపూర్ మాజీ శాసన సభ్యులు ఎస్. ఏ సంపత్ కుమార్ చరవాణి ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలపై చర్చించి పరిష్కరించమని వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. వంద పడకల ఆసుపత్రి, అలంపూర్ లో డిగ్రీకాలేజ్, మినీ బస్సుడిపో, తుమ్మిళ్ల లిఫ్ట్ రెండో దశ పనులు, మల్లమ్మ కుంట, జులకల్, వల్లూరు రిజర్వాయర్లను వెంటనే పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అలాగే జోగులాంబ అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు 100 కోట్లు కేటాయిస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరలేదన్న విషయాన్ని గుర్తు చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలలో ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించినట్లు ఆయన తెలిపారు. ఎర్రవల్లి నూతన మండల ఏర్పాటుపై 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు స్వీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికి ప్రస్తుతం ప్రకటించిన నూతన మండలాల జాబితాలో ఎర్రవల్లి మండలం లేకపోవడం విచారకరమనే విషయాన్ని మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లి నైసర్గికంగా భౌగోళికంగా పరిపాలన పరంగా ఎర్రవల్లి నూతన మండల
ఆవశ్యకతను వివరించినట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వెంట అలంపూర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జోగుల రవి, అలంపూర్ మండల మాజీ అధ్యక్షుడు రాము, యువజన అధ్యక్షులు శ్యామ్ ఉన్నారు