సీఎం… నీకెందుకింత రాక్షసత్వం?
లేదులేదు
* ఇదిగో కుర్చీ వచ్చి సమస్య పరిష్కరించు
* న్యాయం అడిగే గిరిజన రైతులను జైల్లో వేస్తావా?
*మహిళలు, బాలింతలపై అక్రమ కేసులు పెడతావా?
* ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్
* ఎన్నికలెప్పుడొచ్చినా గద్దె దింపడం ఖాయం
* మౌన దీక్షలో కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :గిరిజనుల పోడు భూముల సమస్య, ధరణి పోర్టల్ లో సవరణలు చేయకుండా రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ పై బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సోమవారం స్థానిక వరలక్ష్మి గార్డెన్ లో పోడు భూములు, ధరణి సవరణలపై ‘మౌన దీక్ష ‘చేపట్టారు. 10 గంటలకు ప్రారంభించి 12 గంటల వరకు కొనసాగించారు. దీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. అడవి బిడ్డల దగ్గరకే వచ్చి కుర్చీ వేసుకుని పొడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఎందుకు సమస్యలను గాలికొదిలేశారని ప్రశ్నించారు. పట్టాలిప్పిస్తానన్న హామీ ఏమైంది అని మండిపడ్డారు. ధరణి లోపాలను సవరిస్తానన్న హామీ ఏమైంది అన్నారు. అందుకే నీ కోసం మహారాజా కుర్చీ ఏర్పాటుచేసిన వచ్చి కూర్చొని సమస్యలను పరిష్కరించు అని ఎద్దేవా చేశారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలు మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నారు. ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యను పరిష్కరించు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ తెచ్చి ప్రశాంతంగా ఉన్న ఉళ్లల్లో చిచ్చు పెట్టిండు అన్నారు. సీఎం ఏ పని చేసినా ఆయనకు, ఆయన కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే లేదని వెల్లడించారు.గోల్ మాల్ చేయడానికి, భూములను కబ్జా చేసుకుని దండుకోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు అని మండిపడ్డారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల గుండె పగిలిపోతోంది. ధరణి పోర్టల్ లో కబ్జా కాలం తీసేసిండు పేర్లు, ఊర్లు మార్చేసిండు.. రైతు బంధు నుండి తీసేయడానికే ఇదంతా చేస్తున్నట్లుంది అని ఆరోపించారు. ధరణి పోర్టల్ వల్ల ఎవరికి మేలు జరిగిందో సీఎం చెప్పాలి అని పేర్కొన్నారు. ధరణి వల్ల అన్యాయమైపోతున్నామని మాకు వందలకొద్ది దరఖాస్తులొస్తున్నాయి అని అన్నారు. ధరణి పోర్టల్ అంతా తప్పుల తడక. తహిసిల్దార్ వద్దకు పోతే… నా చేతుల్లో లేదంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళ్లమంటున్నారు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు గందరగోళానికి గురవుతున్నారు అని వెల్లడించారు. సమస్యను పరిష్కరించాలనే భావన అధికారుల్లో ఉన్నప్పటికీ వారి చేతుల్లో అధికారం లేకుండా పోయింది అన్నారు. కనీసం రైతుల సమస్యలు వినాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోవడం హాస్యాస్పదమన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తే సీఎం లక్ష్యం నెరవేరదు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన భూములను సీఎం, ఆయన కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి చేసుకున్నడు. రద్దు చేస్తే నష్టపోతాడనే ఉద్దేశంతోనే లోపాలను సరిదిద్దడం లేదు అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ధరణి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు మా దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాలని సీఎంకు లేఖ రాసినా పట్టించుకోలేదని చెప్పారు. ఇఫ్పటికి 15 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్ లో నమోదు కాలేదు అన్నారు. అహంకారంతో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను జనం చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సీఎం సీటు నుండి దింపేయడం ఖాయం అన్నారు. గిరిజనులకు పోడు భూముల్లో సాగు చేసుకోమని చెప్పి పోలీసులను పంపి కేసులు పెట్టించే విష సంస్కృతి కేసీఆర్ ది అన్నారు. ప్రశ్నించే అడవి బిడ్దలపై లాఠీ ఛార్జ్ చేయిస్తున్నరు. బాలింతలు, మహిళలని చూడకుండా బేడీలు వేసి జైలుకు పంపుతున్నరు. మొన్న ఖమ్మంలో నిన్న మంచిర్యాల జిల్లా దండేపల్లిలోనూ అదే జరిగిందన్నారు. గిరిజనులకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో బీజేపీ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మనోహర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్, రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, జగపతిరావు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, మరి భావన, జితేందర్, ఈసంపల్లి మహేష్ నాయకులు బాస సత్యనారాయణ, కొట్టే మురళీకృష్ణ, కన్నె కృష్ణ, రమేష్ ఆవుదుర్తి శ్రీనివాస్, దుబాల శ్రీనివాస్, సుధాకర్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు