సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వైద్య సిబ్బందికి కలెక్టర్ నారాయణరెడ్డి సూచన
నిజామాబాద్,ఆగస్ట్21(జనంసాక్షి): సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున మెడికల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మోపాల్ మండలం కంజర్ గ్రామ పంచాయతీ భవనంలో మెడికల్ అండ్ హెల్త్ శాఖ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూ అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెడికల్ క్యాంప్, పల్లె ప్రకతి వనం, నర్సరీ, రైతు వేదికను పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. మెడికల్ క్యాంపుకు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో వర్షపు నీరు నిలవడం వల్ల దోమలు పెరుగుతాగని నివారించేందుకు నీరు నిలువకుండా చూడాలని, గ్రామంలో శానిటేషన్ స్పే, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయాలని సర్పంచ్‌కి తెలిపారు. మెడికల్ క్యాంపులో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ప్రైవేట్‌లో చూపించడం వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నారు. పల్లె ప్రకతి వనం దట్టమైన అడవిలా విస్తరించాలని పేర్కొన్నారు. ఎండిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటాలని మొక్కల మధ్య గ్యాప్ లేకుండా వన సేవకులు చూడాలన్నారు. రైతువేదిక సందర్శించి రైతు వేదిక ఆవరణంలో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఖాళీ స్థలం కనబడకుండా మొత్తం మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. పక్కనే రైతు పొలంలో యూరియా చల్లడం గమనించి దగ్గరికి వెళ్లి యూరియా అందుబాటులో ఉన్నదా..? లేదా..? ఎకరాకు ఎన్ని బస్తాలు వాడుతున్నారనే విషయాలు తెలుసుకున్నారు. తక్కువ వాడాలని రైతుకు తెలిపారు. కలెక్టర్ వెంబడి సర్పంచ్ భరత్ ఇంచార్జ్ డీఎంహెచ్‌ఓ సుదర్శనం తహసీల్దార్ వీర్ సింగ్, డాక్టర్ నవీన్‌కుమార్ ఎంపీఓ
ఇక్బాల్ తదితరులు ఉన్నారు.