*సీజనల్ వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స*

హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ

మునగాల, జూలై 29(జనంసాక్షి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంనందు శుక్రవారం సీజనల్ వ్యాధులు మరియు శానిటేషన్ గురించి, వర్షాకాలంలో వచ్చే జబ్బులు డెంగ్యూ మలేరియా చికెన్ అతిసారా, బోదకాలు వంటి వ్యాధులపై హెల్త్ అసిస్టెంట్ లింగం రామకృష్ణ అవగాహన కల్పించారు. డెంగ్యూ మలేరియా ఎలాంటి జ్వరాలకైన ప్రభుత్వ ఆసుపత్రిలోనే రక్త పరీక్షలు వైద్య చికిత్స లభిస్తుందన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని తెలిపారు. చిన్నపిల్లల్లో వచ్చే అతిసార, నీళ్ల విరోచనాల వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కలిగిన వైద్య సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లనే ఉపయోగించి అంటువ్యాధులను అరికట్టాలని తెలిపారు. మురికి నీటి నిలువలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేసి దోమల వ్యాప్తిని అరికట్టాలి, గృహాల్లో  ఉన్న ప్లాస్టిక్ టైర్లు కూలర్లు పూలకుండీలలో నీటిని తీసివేయాలన్నారు. పరిశుభ్రత పాటించి ఆరోగ్య సమాజాన్ని స్థాపించాలని కోరారు. వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి దోమల లార్వాను నిర్మూలించాలన్నారు. ఆశవర్కర్లు ప్రతిరోజు గృహ సర్వే నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులను గుర్తించి ఆరోగ్య కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నారని, అందరూ దోమతెరలను ఉపయోగించుకోవాలని, గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు అక్షరాస్యులు సమిష్టిగా కలిసి సీజనల్ వ్యాధులను అంతం చేయాలని పిలుపునిచ్చారు. మురికినీటిగుంటల్లో, కాలువల్లో దోమల నివారణకు టెమీపాస్ ద్రావణాన్ని పిచికారి చేపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొప్పు ప్రమీల, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు పద్మ, పావని ఆశవర్కర్లు లక్ష్మి, సుధారాణి మాణిక్యమ్మ, గ్రామపంచాయతీ సిబ్బంది నరసయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.