సీజనల్ వ్యాధుల సర్వే పరిశీలించిన డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:- 29
జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఇంటింటి సీజనల్ వ్యాధుల సర్వేను శుక్రవారం ఆర్మూర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రమేష్ పరిశీలించారు. ఆయన మామిడిపల్లి పెర్కిట్ చేపూర్ గ్రామాలలో మరియు ఆర్మూర్ పట్టణంలో శాస్త్రి నగర్ జిరాయత్ నగర్ కమలానగర్ కాలనీ రాజారాం నగర్ ల లో పర్యటించి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు చాలా కురిసినందున సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబులుతాయి కాబట్టి సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎక్కువగా అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. అర్హులైన వారికి కోవిడ్ బూస్టర్ డోసును అందించాలన్నారు. అసంక్రమిత వ్యాధుల సర్వేను 100% అయ్యేవిధంగా చూసి రక్తపోటు మధుమేహం గుర్తించిన వారికి ప్రతి నెల తగు మందులను అందే విధంగా చూడాలన్నారు. చేపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దోమల వల్ల వచ్చే వ్యాధులు మరియు నివారణ చర్యలపై వైద్యాధికారి రమేష్ మరియు ఆర్మూర్ సబ్ యూనిట్ అధికారి సాయి లు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.