సీజేఐనే మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌

– తన ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదు
– స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జులై6(జ‌నం సాక్షి) : న్యాయ కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి విశేషాధికారాలుంటాయని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం మరోసారి నొక్కి చెప్పింది. ఆయనే మాస్టర్‌ ఆఫ్‌ ది రోస్టర్‌ అని, ధర్మాసనాలకు కేసులను కేటాయించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి విశేషాధికారాలను ప్రశ్నిస్తూ శాంతి భూషణ్‌ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం.. సీజేఐ తన ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీజేఐ సమానులలో ప్రథములు అని, ఆయనకు కేసులను కేటాయించే అధికారం ఉంటుందని వెల్లడించింది. సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాలకు ఆయన నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సిక్రీ తీర్పును వెల్లడిస్తూ.. న్యాయవ్యవస్థను తక్కువ చేసే ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థకు పెను ముప్పు అని పేర్కొన్నారు. సీజేఐ.. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి అని, న్యాయవ్యవస్థకు అధికార ప్రతినిధి లాంటివారని అన్నారు. గతంలో న్యాయవాది అశోక్‌ పాండే కూడా ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ సందర్భంలోనూ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే వెల్లడించింది. కేసులను హేతుబద్ధంగా, పారదర్శకంగా కేటాయించేందుకు, ధర్మాసనాల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించాలని న్యాయవాది అశోక్‌ పాండే గత ఏప్రిల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ‘రాజ్యాంగం.. సీజేఐపై విశ్వాసం ఉంచింది. న్యాయమూర్తిగా సీజేఐ.. సమానుల్లో ప్రథముడు. ఇతర విధులు నిర్వర్తించడంలో ఆయన స్థానం విశిష్టం. భారత ప్రధాన న్యాయమూర్తి.. సంస్థ అధిపతి అని చెబుతూ రాజ్యాంగంలోని 146వ అధికరణం ఆయన స్థానాన్ని నొక్కి వక్కాణిస్తోంది. సంస్థాపరమైన దృక్పథం నుంచి చూస్తే ప్రధాన న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు అధిపతి. కేసుల కేటాయింపులో, ధర్మాసనాల ఏర్పాటులో ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక విశేషాధికారం ఉంది.’ అని అప్పటి ధర్మాసనం పేర్కొంది.
కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటుపై అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు ఈ ఏడాది జనవరిలో విూడియాలో సమావేశం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ
నేపథ్యంలోనే న్యాయవాది అశోక్‌ పాండే, మాజీ మంత్రి శాంతి భూషణ్‌ పిటిషన్లు దాఖలు చేశారు.