సీట్ల పంపకాలకు ముందే సిగపట్లు

 

సీట్లు పంచుకోలేని వారు గెలుస్తామంటే నమ్ముతామా

కూటమి నేతల తీరుపై మండిపడ్డ కెటిఆర్‌

సిరిసిల్ల,నవంబర్‌5(జ‌నంసాక్షి): అభ్యర్థుల ప్రకటన రాకముందే కాంగ్రెస్‌లో సిగపట్లు మొదలయ్యాయని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సీట్ల పంచాయితీ తేల్చుకోలేని వారు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ రాజన్నసిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో

భాగంగా మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్నాటు చేసిన ఆర్‌ఎంపీ, పీఎంపీల సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో అవరోధాలు సృష్టించిందని విమర్శించారు. బంగారు తెలంగాణెళి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. వేములవాడలో వందపడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. 40 ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాట్లు చేసినం. సిరిసిల్లలో 300 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నం. ప్రతీ ఏరియా ఆస్పత్రిలో 10 పడకలతో ఐసీయూలు ఏర్పాటు చేసామని అన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు త్వరలో ధృవీకరణ పత్రాలు అందజేస్తమని చెప్పారు. అసాధారణ వేగంతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం. ఇదివరకు గోదావరి జలాలు వస్తాయంటే ఓ కలగానే ఉండేది. త్వరలోనే జిల్లాలో ఇంటింటి మంచినీళ్లు అందిస్తం. కేసీఆర్‌ కార్యదక్షత వల్లే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇవ్వగలుగుతున్నం. సీఎం కేసీఆర్‌ పట్టుదలతోనే రైతులు కాలర్‌ ఎగరేసి చెప్పుకునేలా కరెంట్‌ ఇస్తున్నమన్నారు. సమావేశంలో వేములవాడ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.