సీనియర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇకలేరు

– సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1999, 2004లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి జానారెడ్డిపై ఘన విజయం సాధించారు. నోముల నర్సింహయ్య మృతి పట్ల పలువురు నేతలు గ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు.1956 జనవరి 9న నల్గొండ జిల్లా పాలెంలో జన్మించిన నోముల నర్సింహయ్య విప్లవోద్యమంలో విద్యార్థిగా.. వామపక్ష నాయకుడిగా.. ఆధునిక రాజకీయాల్లో అలుపెరగని నేతగా గుర్తింపు పొందారు. మూడున్నర దశాబ్దాల పాటు కమ్యూనిస్టు నేతగా సేవలందించిన ఆయన తెరాసలో చేరడం విమర్శలకు దారితీసినా.. అక్కడా విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించారు.1978 నుంచి 2018 దాకా నాలుగు దశాబ్దాలపాటు నాగార్జునసాగర్‌ నియోజకవర్గ రాజకీయ యవనికపై ఏకఛత్రాధిపత్యం వహించిన కుందూరు జానారెడ్డిని ఓడించిన చరిత్ర నోములది. 2014లో జానారెడ్డి చేతిలో ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకున్నా.. వెరవని ధీరత్వంతో మరుసటి ఎన్నికల్లోనే ప్రత్యర్థిని కంగుతినిపించారు. 1994 మినహా ఏడు సార్లు నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న జానారెడ్డిని ఓడించడం నోముల ప్రత్యేకతను చాటింది. నోముల తన రాజకీయ ప్రస్థానంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఓటమి పాలయ్యారు. 2009లో భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో, 2014లో నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారన్నారు. నర్సింహయ్య మరణం తెరాస, నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. నోముల రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని, ఆయన మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

నోముల భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) ఈ ఉదయం మృతి చెందారు. తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన నర్సింహయ్యను కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం భౌతికకాయాన్ని కొత్తపేటలోని కుమారుడి నివాసానికి తరలించారు. నర్సింహయ్య పార్థివదేహానికి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు భాస్కర్‌ రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు నర్సింహయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. నర్సింహయ్య ఆకస్మిక మరణం దురదృష్టకరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జీవితాంతం ప్రజల కోసం.. వారి హక్కుల కోసం పోరాడారని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేసిన వ్యక్తి నర్సింహయ్య అని కొనియాడారు. ఆయన మృతి నల్గొండ జిల్లా ప్రజలకు తీరని లోటని చెప్పారు. నోముల మృతదేహాన్ని ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు నల్గొండలోని అలియాకు తరలించి అక్కడి నుంచి రేపు ఉదయం నకిరేకల్‌కు.. ఎల్లుండి స్వగ్రామం పాలెంకు తరలించనున్నట్లు మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు. పాలెంలో నర్సింహయ్య అంత్యక్రియలు నిర్వహిస్తారని మంత్రి వివరించారు.

కిషన్‌ రెడ్డిగ్భ్భ్రాంతి

నర్సింహయ్య అకాల మరణం పట్ల కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిన అతికొద్దిమంది ప్రజానాయకుల్లో నోముల నర్సింహయ్య ఒకరని కొనియాడారు. తెలంగాణ యాస, భాషతో శాసనసభలో ప్రజాసమస్యలపై గళం విప్పి అనేక ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన గొప్ప నాయకుడన్నారు. నిరంతరం పేదల సంక్షేమానికి, అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించే వారని తెలిపారు. నర్సింహయ్యతో కలిసి రెండుసార్లు శాసనసభలో పనిచేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

జననేతను కోల్పోయాం: కాంగ్రెస్‌

నోముల అకాల మరణం పట్ల కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఒక జననేతను కోల్పోయామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. నర్సింహయ్య మరణం ఉమ్మడి నల్గొండ జిల్లాకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని వారు కొనియాడారు