సీపీఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
సిపిఐ నాయకులు చొప్పరి శేఖర్, మంద భాస్కర్
కేసముద్రం అక్టోబర్ 11 జనం సాక్షి / భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుండి 18 తేదీ వరకు విజయవాడలో జరుగుతున్నాయని,ఈ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్,మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చొప్పరి శేఖర్ ,మంద భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత మతోన్మాదం విపరీతంగా పెరిగిందన్నారు.మతం పేరుతో, కులం పేరుతో దళితులు,ముస్లిం,మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయన్నారు.కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందన్నారు.రాజ్యాంగ మౌలిక సూత్రాలను,భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా పాలన కొనసాగిస్తోందని విమర్శించారు.ప్రశ్నించే తత్వాన్ని అణగదొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశ సంపదను పేదలకు అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం దుర్మార్గమన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే,బ్యాంకింగ్, బీమా,రక్షణ తదితర రంగాల ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అమ్మడం సిగ్గు చేటన్నారు.దేశ ప్రజల సహజ సంపదను అమ్మడమే దేశభక్తా అని ప్రశ్నించారు.అనేక సంవత్సరాలు పోరాటాలు ,ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ కార్మిక చట్టాలను ప్రైవేట్, కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉండే విధంగా సవరించి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందన్నారు.తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పొందుపర్చినప్పటికీ నేటికి ఆ దిశగా అడుగులు వేయక పోవడంతో పాటు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాహాటంగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయమని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పైన ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు లైశెట్టి భాస్కర్,వడ్డెబోయిన లక్ష్మినర్సయ్య,దాసరి లింగస్వామి,భూక్యా వీరన్న,జూకంటి రవి తదితరులు పాల్గొన్నారు.
Attachments area