సునంద కేసు విచారణపై అనుమానాలు

sx150lry copyన్యూఢిల్లీ : తన భార్య సునందా పుష్కర్ మృతిపై విచారణ జరిగిన తీరుమీద తనకు చాలా అనుమానాలు ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చెప్పారు. అసలు ఏ ఆధారాలతో పోలీసులు ఈ రకమైన నిర్ధారణకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. సునందా పుష్కర్ది హత్యేనని, సహజ మరణం కాదని ఎయిమ్స్ నిపుణులు వెల్లడించిన పోస్టుమార్టం నివేదిక వెలుగులోకి వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ కేసు దర్యాప్తు దాదాపు ఏడాదిగా సాగుతోందని, ఇన్నాళ్లుగా తన మీద చాలా రకాల ఒత్తిళ్లు పనిచేశాయని ఆయన అన్నారు. బయటకు వచ్చి వ్యాఖ్యానించాలని తనను చాలామంది రెచ్చగొట్టినా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు తాను వచ్చి ఏదో మాట్లాడితే అది పోలీసుల దర్యాప్తును దెబ్బతీస్తుందన్న ఉద్దేశంతోనే, వారిమీద గౌరవం వల్లే ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నానన్నారు.

అలాగే.. కొన్ని టీవీ ఛానళ్లు టీఆర్పీల కోసం ఈ వ్యవహారం మీద బహిరంగ చర్చలు పెట్టాయని ఆయన మీడియామీద మండిపడ్డారు. సునంద మృతితో ఆమె కుటుంబం గానీ, భర్తగా తాను గానీ చాలా బాధపడ్డామని, తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని శశి థరూర్ అన్నారు. ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో ఇప్పుడు ఈ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడక తప్పలేదన్నారు. విచారణలో పోలీసుల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదనే తాను భావించినట్లు ఆయన తెలిపారు. తన భార్య మరణించిన కొన్ని రోజులకే.. తాను స్వయంగా కేంద్ర హోం మంత్రికి లేఖ రాసి, విచారణను వేగవంతం చేయాలని కోరానన్నారు. తాను పోలీసులకు ఎప్పుడూ ఈ కేసులో సహకరిస్తూనే ఉన్నానని, మీడియా కూడా ఈ విషయంలో సంయమనం పాటించాలని తెలిపారు. కొంతైనా మానవత్వం అన్నది ఉండాలని సూచించారు.