సుపరిపాలన అందిస్తా

1
బీహార్‌ సీఎంగా నితిష్‌ ప్రమాణం

పాట్నా, ఫిబ్రవరి 22(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిహార్‌లో సుపరిపాలన అందిస్తామని సీఎంగా పగ్గాలు చేపట్టిన నితీశ్‌కుమార్‌ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన ఆయన లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్‌యూ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి మాంఝీని సీఎంగా నియమించారు. అయితే పార్టీలో విభేదాలు ఏర్పడటంతో సీఎం పదవి నుంచి మాంఝీ తప్పుకున్నారు.దీంతో నితీశ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్‌ త్రిపాఠి వారితో ప్రమాణం చేయించారు. మాంజీ రాజీనామా చేసేవరకు బీహార్‌ రాజకీయంలో హై డ్రామా నడిచింది. జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ 4వ సారి బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మాంజీ రాజీనామా నేపథ్యంలో నితిన్‌ శనివారం నాడు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ తిపాఠి ఆయనను ఆహ్వానించారు. బీహార్‌ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బాధ్యతలు చేపట్టిన నితీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

బీహార్‌ ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీష్‌ కుమార్‌ గవర్నర్‌ త్రిపాఠికి వెల్లడించారు. బల నిరూపణకు గవర్నర్‌ మూడు వారల గడువు ఇచ్చారు. అంటే నితీష్‌కు అసెంబ్లీలో బలం నిరూపణ చేసుకునేందుకు మార్చి 16 వరకు సమయం ఉంది. లోక్‌ సభ ఎన్నికల్లో బీహార్‌లో జేడీయూ పరాభవానికి నితీష్‌ కుమార్‌ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన వారసుడిగా జితేంద్ర మాంజీని ముఖ్యమంత్రిని చేశారు. అయితే వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపే సత్తా మాంఝీకి లేదని పార్టీ భావించింది. గద్దె దిగిపోవాలని మాంజీని ఆదేశించింది. దానికి ఆయన ససేమిరా అనడంతో బీహార్‌లో హై డ్రామా నడిచింది. పార్టీ నిర్ణయాన్ని కాదన్న మాంజీపై జేడీయూ సస్పెన్షన్‌ వేటు వేసింది. అదే సమయంలో జేడీయూ శాసనభ పక్ష నేతగా నితీష్‌ను ఎన్నుకున్నారు. అయినా గద్దె దిగేందుకు మాంజీ నిరాకరించారు. దాంతో బలనిరూపణ అనివార్యమైంది. విశ్వాస పరీక్ష సమయంలో మాంజీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఒక దశలో బీహార్‌ రాజకీయం ఢీల్లీకి చేరింది. చివరకు విశ్వాస పరీక్షకు ముందు మాంజీ రాజీనామాతో సంక్షోభానికి తెరపడింది.