సుప్రిం తీర్పుతో బీజేపీకి ఎదురుదెబ్బే

– ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశం
– రహస్య బ్యాలెట్‌ విధానాన్ని తిరస్కరించిన న్యాయస్థానం
– సుప్రిం తీర్పుతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లో ఆనందం
న్యూఢిల్లీ, మే18(జ‌నం సాక్షి ) : కన్నడ నాట రసవత్తరంగా సాగుతున్న రాజకీయాల నేపథ్యంలో సుప్రింకోర్టు తీర్పు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. బలపరీక్షకు సిద్ధమవుతున్న యడ్యూరప్ప సర్కార్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైనట్లయింది. బీజేపీ చేసిన ఏ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. బీజేపీ తరుపు న్యాయవాధి తమకు బలనిరూపణకు కనీసం వారం రోజులు గడువు ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్ధానం, అలాంటి అవకాశాలు లేవని స్పష్టం చేసింది. వెంటనే అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహించాలని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం సూచించింది. అదేవిధంగా ప్రొటెం స్పీకర్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని, ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. మరోవైపు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. అసెంబ్లీలో రహస్య బ్యాలెట్‌ ద్వారా బలపరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. తమ ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో ఉన్నారని చెప్పినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. బలపరీక్షకు కనీసం సోమవారం వరకూ సమయం ఇవ్వాలన్నా అంగీకరించలేదు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు..
కన్నడనాట క్షణం క్షణం రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీకి గవర్నర్‌ 15రోజులు సమయం కల్పించారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లో కలవరం మొదలైంది. సమయం ఎక్కువగా ఉండటంతో పాటు బీజేపీ ఆపరేషన్‌ కమలంను తెరపైకి తేవడంతో ఎక్కడ ఎమ్మెల్యేలు చేజారుతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా తమతమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందు  హైదరాబాద్‌కు తరలించారు. దాదాపు 76 మంది ఎమ్మెల్యేలు బంజారాహిల్స్‌లో తాజ్‌ కృష్ణా ¬టల్‌లో బస చేయనున్నారు. కర్ణాటక శాసనసభలో విశ్వాసపరీక్ష వరకూ వారు ఇక్కడే బస చేస్తారని తెలిసింది. ఎమ్మెల్యేలందరికి 76 గదులు కేటాయించినట్లు తెలిసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. మొత్తం హైదరాబాద్‌లోని రెండు ¬టళ్లలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. మొత్తం అందరూ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్‌కు చేరుకున్నట్లు కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. అయితే, ఎమ్మెల్యే సంఖ్య చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తాజ్‌కృష్ణ ¬టల్‌ వద్దకే జేడీఎస్‌ ఎమ్మెల్యేల బస్సు చేరుకుంది. 36 మంది జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే బస చేయనున్నారు. కాగా శుక్రవారం సుప్రిం తీర్పుతో కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణ ఉండటంతో శనివారం మధ్యాహానికే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకొనేలా కాంగ్రెస్‌, జేడీఎస్‌ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా ఎమ్మెల్యేలను తరలించేలా కాంగ్రెస్‌, జేడీఎస్‌ అగ్రనేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.