సుప్రీం చెప్పినా.. 

ఆప్‌కు తప్పని ఆటంకం
– ఉద్యోగుల బదిలీలను తిరస్కరించిన సర్వీస్‌ విభాగం
– లెఫ్టినెంట్‌ గవర్నరే ఈ విభాగానికి ఇంఛార్జిగా ఉన్నట్లు వెల్లడి
– కోర్టు ధిక్కరణ కింద సుప్రీంను ఆశ్రయిస్తామని హెచ్చరించిన ఆప్‌ ప్రభుత్వం
న్యూఢిల్లీ, జులై 5(జ‌నం సాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే బాస్‌ అని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కాదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేజీవ్రాల్‌ సర్కారుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి మళ్లీ ఆటంకం ఎదురైంది. ఢిల్లీలో ప్రభుత్వానికే అత్యధిక అధికారాలు ఉంటాయని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఢిల్లీ ప్రభుత్వంతో సఖ్యతగా పనిచేయాలని, ఆటంకాలు కలిగించకూడదని బుధవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు చెప్పిన కొన్ని గంట్లోనే ఆప్‌ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. అయితే దీనిని సర్వీస్‌ విభాగం తిరస్కరించింది. ఇంకా లెఫ్టినెంట్‌ గవర్నరే ఈ విభాగానికి ఇంఛార్జిగా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆప్‌ సర్కారుకు మళ్లీ ఆటంకం ఎదురైంది. సర్వీస్‌ విభాగం చర్యలతో తాము కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పును స్పష్టం చేసింది. భూ సంబంధ, పోలీసు, పబ్లిక్‌ ఆర్డర్‌ మినహా మిగతా అధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని తెలిపింది. ఈ మూడు విభాగాలు మాత్రం ఎల్జీ ఆధీనంలో ఉంటాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, అధికారుల నియామకాలు, బదిలీలపై ఎల్జీ సంతకం చేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఆయన సంతకం చేస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించనట్లవుతుందని, దానిపై ఆప్‌ కోర్టుకు వెళ్లొచ్చని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా ఎల్జీ అధికారుల బదిలీలు చేయడానికి వీల్లేదని అన్నారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎల్జీ బదిలీలు చేయొద్దు. ¬ం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ రద్దయ్యే వరకు ఒకవేళ సిసోడియా ఆదేశాలు పాటించేందుకు అధికారులు అంగీకరించకపోతే ఇక డివిజన్‌ బెంచ్‌ నిర్ణయం తీసుకునే వరకు ఢిల్లీలో ఎలాంటి బదిలీలు ఉండవు అని ఆప్‌ గురువారం ఉదయం ట్వీట్‌ చేసింది. అయితే ఆప్‌ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన ఆదేశాలు చట్టప్రకారం సరైనవి కావని సిసోడియాకు వివరించినట్లు ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు.