సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత

 

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి కొద్దిసేపటి కిందట మృతి చెందారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానుల సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.

మహేశ్ బాబు కుటుంబంలో ఒకే ఏడాది రెండు విషాదాలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. సూపర్ స్టార్ కృష్ణకు ఇందిరా దేవి మొదటి భార్య కాగా.. వీరికి మహేష్, రమేష్, మంజుల, ప్రియుదర్శిని, పద్మావతి జన్మించారు. కాగా కృష్ణ రెండో భార్య విజయ నిర్మల 2019 లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇందిరాదేవి మృతితో ఘటమనేని కుటుంబంతో పాటు..టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు..ఇందిరాదేవి బర్త్ డే రోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు. కాగా, ఇటీవల కాలంలోనే…విజయ నిర్మల, రమేష్ బాబు మృతితో దిగాలు చెందుతున్న ఘట్టమనేని ఫ్యామిలీలో.. ఇప్పుడు ఇందిరాదేవి మరణం మరింత బాధాకరమైన విషయం.