సెంటిమెంట్‌ బ్యాట్‌

ఒకే బ్యాట్‌తో 14శతకాలు పూర్తిచేసిన మాస్టర్‌
ఒకే బ్యాట్‌తో 14 శతకాలు పూర్తి చేసిన మాస్టర్‌ఢిల్లీ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ కూడా అందరి క్రికెటర్లలాగే సెంటిమెంట్‌ను నమ్ముతాడు. ఒకే బ్యాట్‌తో 14 శతకాలు పూర్తి చేశాడంటే ఆయనకు సెంటిమెంట్‌ మీద ఉన్న నమ్మకం ఇట్టే తెలిసిపోతుంది. దక్షిణాఫ్రికాతో సెంచురియన్‌ మైదనాంలో జరిగిన తొలి టెస్టులో 50వ టెస్టు సెంచరీ కొట్టేందుకు మాస్టర్‌ ఉపయోగించిన బ్యాట్‌ చూస్తే.. ఆయనకు బ్యాట్ల కొరతేమోనని అందరూ అనుకుంటారు. కానీ దీని వెనుక కారణం వేరే ఉంది. ఒకే బ్యాట్‌తో 14 శతకాలు కొట్టాడంటే ఆ బ్యాట్‌ ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. నెట్‌ ప్రాక్టిస్‌లో ఎప్పుడు వాడని ఈ బ్యాట్‌ను మ్యాచ్‌ల్లో మాత్రం దీనిపైనే ఆధారపడుతాడట. సెంచూరియన్‌లో సఫారీలపై చేసిన 111 పరుగులకు, తద్వారా టెస్టుల్లో చరిత్ర సృష్టించడానికి ఈ బ్యాటే కారణమట. 2006లో ఫామ్‌ను కోల్పోయి.. సచిన్‌ గడ్డు కాలం ఎదుర్కొన్నాడు. అప్పుడు ఓ అడ్రంగి అతడిని గట్టెంక్కించాడట. రాహుల్‌ ద్రావిడ్‌ పరిచయం మేరకు రామ్‌ భండారీ అనే ఓ బెంగళూరు వాసి సచిన్‌ సమస్యను తెలికగా పరిష్కరించాడట. బీహార్‌ నుంచి కర్ణాటక వలసొచ్చిన భండారీ ఎప్పుడో తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న వడ్రంగిని హాబీగా చేపట్టాడు. స్థానిక క్రికెటర్ల బ్యాట్లను తయారు చేస్తూ ఆయన ఎంతో పాపులర్‌ అయ్యాడు. సచిన్‌ బ్యాట్‌ బరువు ఉండడం వల్లే అత్యధికంగా పరుగులు చేయకపోవడానికి కారణమని తెలుసుకున్న భండారీ 1350 గ్రాములన్న బ్యాట్‌ను 1250 గ్రాములకు తగ్గించాడు. అప్పటి నుంచి సచిన్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. 17 వేల పరుగుల మైలురాయిని దాటడం వంటి అరుదైన రికార్డులు సైతం సాధించాడు.