సెక్సు కుంభకోణంలో యుఎస్‌ అధికారి

వాషింగ్టన్‌ : సెక్స్‌ కుంభకోణంలో మరో యుఎస్‌ ఉన్నత సైనికాధికారి చిక్కుకున్నారు. అఫ్గనిస్థాన్‌లోని నాటో కమాండర్‌ జనరల్‌ జాన్‌ అల్లెన్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. జిల్‌కెల్లీ అనే ఫ్లొరిడా మహిళతో ఆయన తగనిరీతిలో వ్యవహరించినట్లు సీనియర్‌ యుఎస్‌ రక్షణ అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. ఇప్పటికే ఆమెపై పలు ఆరోపణలు వచ్చాయి. మరో జనరల్‌ డేవిడ్‌ హెచ్‌ పెట్రియాస్‌తో ఈమెకు సంబంధాలున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక అఫ్గనిస్తాన్‌లో విధులు నిర్వహిస్తున్న జనరల్‌ జాన్‌ అల్లెన్‌ కూడా ఇదే ఆరోపణలో చిక్కుకున్నారు. యుఎస్‌ రక్షణ కార్యదర్శి లియాన్‌ ఇ పానెట్లా విమానంలో అస్ట్రేలియా వెళుతూ విలేరులతో మాట్లాడుతూ అల్లెన్‌పై ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఫెడరల్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ ఏజెన్సీ రంగంలోకి దిగినట్లు చెప్పారు. జనరల్‌ అల్లెన్‌ఉ కెల్లీకి మధ్య విస్తృతంగా ఇ మెయిల్స్‌ వెళ్లాయని ఇందుకు సాక్ష్యాలున్నాయని చెప్పారు. కెల్లీ వివాహిత మహిళ. తన పిల్లలతో టాంపా పట్టణంలో నివసిస్తోంది. అల్లెన్‌ నేరపూరిత చర్యకు పాల్పడ్డారా అని ప్రశ్నించగా అది ఎఫ్‌బీఐ నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. కాగా తాను తప్పేమీ చేయలేదని అల్లెన్‌ రక్షణశాఖకు చెప్పినట్లు తెలిసింది. అల్లెన్‌ కూడా వివాహితుడే. అల్లెన్‌ అఫ్గనిస్తాన్‌లో 68,00 సైనిక దళాలకు సారథ్యం వహించారు.