సెహ్వాగ్ అ 100 అరుదైన రికార్డుకు వేదికగా వాంఖేడే స్టేడియం కెరీర్‌లో వందో టెస్ట్ ఆడనున్న సెహ్వాగ్
ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత క్రికెటర్
ముంబై ,నవంబర్ 21: టీమిండియా డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముంబై టెస్టుతో అరుదైన మైలురాయి అందుకోనున్నాడు. ఆ మ్యాచ్‌తో వీరూ కెరీర్‌లో వంద టెస్టులు పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు.అతను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే… ఎందుకంటే బంతి మైదానంలో కంటే బౌండరీ అవతలే ఎక్కువగా ఉంటుంది…ఎటువంటి బంతి సంధించినా దానిని బాదడమే అతని టార్గెట్… అన్ని ఫార్మేట్లలోనూ ఒకే విధంగా ఆడడమే అతని స్టైల్… అతనెవరో కాదు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్… సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ అభిమానులకు పండగే.. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లా ట్రేడ్‌మార్క్ షాట్లు కొట్టడం ఈ ఢిల్లీ క్రికెటర్‌కు చేతకాదు. ప్రతీ బాల్‌నూ బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడుతుంటాడు. ఈ స్పెషాలిటీనే వీరేంద్రునికి గుర్తింపు తెచ్చింది. ఓపెనర్‌గా నిలబెట్టింది కూడా.. ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచాలంటే ఏ జట్టుకైనా అదిరిపోయే ఆరంభం కావాలి. అలాంటి ఆరంభాలకు ప్రత్యక్ష ఉదాహరణ సెహ్వాగ్ బ్యాటింగ్. నిజానికి మూడు ఫార్మేట్లలోనూ ఒకే స్టైల్‌లో ఆడడం కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ కొద్ది మందిలో వీరూ ఖచ్చితంగా ఉంటాడు.భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టెస్టుతో అరుదైన మైలురాయి అందుకోనున్నాడు. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌తో కెరీర్‌రో వంద టెస్టులు పూర్తి చేసుకోనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటి వరకూ సచిన్ , ద్రావిడ్ , లక్ష్మణ్ , కుంబ్లే , కపిల్‌దేవ్ , గవాస్కర్ , వెంగ్‌సర్కార్ , గంగూలీ మాత్రం ఈ మైలురాయి సాధించారు. వీరూ 2001లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 99 టెస్టుల్లో 50.89 సగటుతో 8448 పరుగులు చేశాడు. దీనిలో 23 సెంచరీలు , 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ కెరీర్‌లో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ సృష్టించాడు. అలాగే ఆరు సార్లు 200కి పైగా , 14 సార్లు 150కి పైగా స్కోర్ సాధించాడు. ట్రిపుల్ సెంచరీ ముంగిట కూడా సిక్సర్ కొట్టే దమ్మున్న ఆటగాడు వీరూ మాత్రమే. అయితే ఈ దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్‌కు వికెట్ ఇచ్చుకుంటాడని విమర్శలు వచ్చినా సెహ్వాగ్ మాత్రం తనకు నచ్చినట్టే ఆడతాడు. ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా వంద టెస్టుల మైలురాయి చాలా గొప్ప విషయం. అలాంటి అరుదైన ఘనత అందుకోబోతోన్న వీరేంద్రుడు వందో టెస్టులో శతకం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.