సైబర్‌ క్రైంపై దృష్టి పెట్టండిషిండే హెచ్చరిక

తెలంగాణను కాలమే పరిష్కరించాలి
కేంద్ర మంత్రితో సిఎం భేటీ
హైదరాబాద్‌, నవంబర్‌ 2 : ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానంతో పాటు నేర స్వరూపం కూడా మారుతోందని, రానున్న రోజుల్లో సైబర్‌ క్రైం కీలకాంశంగా మారనున్నదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే శుక్రవారంనాడు అన్నారు. సైబర్‌ క్రైమ్‌ను అరికట్టేందుకు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దీటుగా ప్రణాళికలు రచించాలని ఆయన సూచించారు. దేశంలో అంతర్గత భద్రత రోజు రోజుకు పెనుసవాల్‌గా మారుతోందని ఆయన హెచ్చరించారు. ఈ సవాళ్లను సమర్ధంగా అధిగమించేందుకు వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్బోదించారు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. టెర్రరిజం, మావోయిజంపై కూడా దృష్టి సారించాలని ఆయన చెప్పారు. పోలీసు పెరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గాలను వెదుకుతున్నామని చెప్పారు. తెలంగాణ సమస్యకు కాలమే పరిష్కారం చూపుతుందని, ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించలేమని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ఎవరి అభిప్రాయాలు వారు తెలియపర్చవన్నారు. ఈ అంశంపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు లేఖపై ప్రశ్నించగా..చంద్రబాబు రాసిన లేఖ గురించి తనకు తెలీదని అన్నారు. ఎవరైన ఈ అంశంపై తమకు లేఖలు రాయొచ్చని వ్యాఖ్యానించారు.
శివరాంపల్లిలో షిండే..
కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌షిండేను ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి కలుసుకున్నారు.శివరాంపల్లిలోని పోలీసు అకాడమీలో 64వ బ్యాచ్‌ ఐపిఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో కేంద్ర మంత్రి శుక్రవారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అకాడమీలో 140 మంది ట్రైనీ ఐపిఎస్‌లను హోం మంత్రి షిండే అభినందించారు.అంతకు ముందు..కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా సిఎం కలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. కేంద్ర మంత్రితో పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది.