సోనియాతో కమల్‌హాసన్‌ భేటీ

కాంగ్రెస్‌ మద్దతుపై ఊహాగానాలు

మర్యాదపూర్వక భేటీ అన్న కమల్‌

న్యూఢిల్లీ,జూన్‌ 21(జ‌నం సాక్షి): రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ గురువారం యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీని కలిశారు. తన రాజకీయ పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ నమోదు విషయంలో కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి దిల్లీ వెళ్లిన కమల్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యారు. బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, ఈరోజు ఉదయం సోనియా గాంధీని కలిసి మాట్లాడారు. అయితే కమల్‌ మరే ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను కలవలేదు. దీంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మక్కల్‌ నీది మయ్యమ్‌ కాంగ్రెస్‌కు మద్దతిచ్చే దిశగా అడుగులు వేస్తోందా? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సోనియాగాంధీతో సమావేశం అనంతరం కమల్‌హాసన్‌ను విలేకరులు ప్రశ్నించగా.. విూకు తెలియజేయడానికి ఎలాంటి విషయాలు లేవని, కేవలం తాను మర్యాదపూర్వకంగా కాంగ్రెస్‌ నేతలను కలిశానని చెప్పారు. వాళ్లు రాజకీయ నాయకులకు ముందు తల్లీ కొడుకులు.. నిన్న కొడుకును, ఈరోజు తల్లిని కలిశాను. ఈ రెండు సమావేశాలను ఒక్కటిగానే పరిగణించాలని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఆలోచన ఉందా? అని అడిగిన ప్రశ్నకు.. ఇంత త్వరగా పొత్తుల గురించి మాట్లాడలేమని అన్నారు. తమ మధ్య అలాంటి చర్చలేవిూ జరగలేదని స్పష్టంచేశారు. తాము కేవలం తమిళనాడులోని రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడామని చెప్పారు. కమల్‌ హాసన్‌ కొత్త రాజకీయ మిత్రుల కోసం భాజపాయేతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా కమల్‌ హాజరయ్యారు. అప్పుడే మొదటిసారిగా సోనియా, రాహుల్‌ను కలిశారు.