స్మృతీ ఇరానీ అలక

4

– ప్రొఫైల్‌లో శాఖ రాసుకోలేదు

– కేంద్రమంత్రేనట

న్యూఢిల్లీ,జులై 6(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ జౌళిశాఖకు మారారు. దీంతో ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రొఫైల్‌ను మార్చుకున్నారు. అయితే జౌళి శాఖ మంత్రిగా రాయకుండా.. కేంద్ర మంత్రి, గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా మాత్రమే తన ప్రొఫ్గై/ల్‌లో పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌లో  మార్పులు చేర్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న స్మృతి ఇరానీని మానవవనరుల శాఖ నుంచి తప్పించారు. ఆ స్థానంలో ప్రకాశ్‌ జవదేకర్‌ను నియమించి.. స్మృతికి జౌళి శాఖను అప్పగించారు. మానవవనరుల శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపడుతున్న ప్రకాశ్‌ జవదేకర్‌.. స్మృతిఇరానీని కలిశారు. ఈ సందర్భంగా జవదేకర్‌కు ఆమె అభినందనలు తెలియజేశారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా.. ప్రధాని మోదీ సహా పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. జౌళి శాఖ బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. దేశంలో ప్రముఖ రంగాల్లో ఒకటైన జౌళి శాఖలో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆమె ట్వీట్‌ చేశారు.రాజకీయంగా కీలకమైన ఈ శాఖ నుంచి స్మృతిని తప్పించి అంతగా ప్రాముఖ్యత లేని చేనేత, జౌళిశాఖకు మారుస్తూ కేబినేట్‌ తీసుకున్న నిర్ణయం వెనుక బీజేపీ ప్రముఖనేత హస్తం ఉందని ఓ వైపు వినవస్తుండగా, మరో వైపు ఇరానీ శాఖ మార్పునకు కారణం రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ అని గుసగుసలు వినవస్తున్నాయి.ఇరానీ శాఖను మార్పునకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసిద్ధత వ్యక్తం చేయకపోయినా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్ణయం మేరకు ఆమెకు జౌళి శాఖను అప్పజెప్పినట్లు సమాచారం. తనను జౌళి శాఖకు పంపడంతో ఆమె కూడా అప్‌ సెట్‌ అయ్యారని ఉన్నతవర్గాల సమాచారం. ఇరానీ ప్రవర్తన వల్లే ఆమె హెచ్‌ఆర్డీ శాఖ నుంచి బయట పడ్డారని కొందరు అంటున్నారు. ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌, జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య తదితరాలు ఆమెను విలన్‌ గా చిత్రీకరించాయని వారు అభిప్రాయపడుతున్నారు. స్మృతి ఇరానీ పద్ధతి సంఘ్‌ పరివార్‌ కు కూడా నచ్చకపోవడంతోనే ఆమెను వేరే శాఖకు మార్చడానికి ప్రధానకారణం అని మరో గొంతుక కూడా వినవస్తోంది. దీంతో రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన హెచ్‌ఆర్డీకు ఎలాంటి వివాదాలు లేని ప్రకాశ్‌ జవదేవకర్‌ కు అప్పగించారని అంటున్నారు.గుజరాత్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి జుబిన్‌ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఆలోచించకుండా మావవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ను అప్పగించారు. 2014 నుంచి ఇప్పటివరకు ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన ఆమె రెండేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.