స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జిల్లా ప్రజల భాగస్వామ్యం,స్ఫూర్తి ఆమోఘం.

కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.
ఈనెల13నుండి15వరకు ప్రతి ఇంటి
జాతీయ జెండా ఎగురవేయాలి.
ఎంఎల్ఏ మర్రి జనార్ధన్ రెడ్డి.
యువత అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.
జిల్లా ఎస్పీ కె.మనోహర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో నాగర్ కర్నాల్ జిల్లా ప్రజల భాగస్వామ్యం, స్ఫూర్తి  ఆమోఘమని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అభినందించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు రెండు వారాల పాటు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలో ఫ్రీడమ్ రన్ ఏర్పాటు చేయడం జరిగింది.  ఉదయం 7 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణం నుండి ప్రారంభమై ట్యాంక్ బండ్ మైసమ్మ గుడి నుండి తిరిగి కలెక్టరేట్ కు చేరుకున్న ఈ ఫ్రీడమ్ రన్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జడ్పి చైర్మన్ పి. పద్మావతి, ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి,జిల్లా ఎస్పీ కే. మనోహర్ జిల్లా అధికారులు,పోలీస్ సిబ్బంది, పెద్దమొత్తం లో యువత,  విద్యార్థులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని  ఫ్రీడమ్ రన్ విజయవంతం చేశారు. త్రివర్ణ పతాకాలను చేత బూని అధికారులు, యువత,విద్యార్థులు    పరిగేడుతుంటే ట్యాంక్ బండ్ మొత్తం త్రివర్ణ పతాక శోభను సంతరించుకుంది.జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు, ఎస్పీ  అందరికంటే ముందు  పరిగెడుతూ ఉత్సాహంగా భారత్ మాతా కి జై అని యువత, విద్యార్థుల్లో జోష్ నింపారు.ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.  మిగిలిన రోజుల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో సైతం ప్రజలు భాగస్వాములై దేశ సమగ్రత కై పునరంకితం కావాలని కోరారు.
శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి:  
స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అగుచున్న ఈ సందర్భంలో స్వాతంత్య్రం కొరకు పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలు నిర్వహిస్తు న్నాయన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో 14 రోజుల పాటు  రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహించడం జరుగుతుందన్నారు.మహనీయుల త్యాగాలను స్మరించుకుంటు కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా మనమంతా భారతీయలమని ప్రపంచానికి చాటిచెప్పా లని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.జిల్లా ప్రజలు దేశభక్తి, దేశ సమైక్యతను చాటుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.ఈ నెల13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటి పై మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేయలని ప్రజలను కోరారు.
ఎస్పీ కె. మనోహర్:
జిల్లా ఎస్పీ కె. మనోహర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములై జిల్లాలో ఒక గొప్ప పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ముఖ్యంగా యువత అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.ఈ ఫ్రీడమ్ రన్ లో అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆడిషన్ ఎస్పీ లు రామేశ్వర్ రావు, భరత్ జిల్లా అధికారులు యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.