స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, జులై6(జ‌నం సాక్షి ): దేశీయ మార్కెట్లు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో శుక్రవారం  ట్రేడింగ్‌ను సూచీలు లాభాలతో ప్రారంభించాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా మొదలైనా.. కాసేపటికే జోరందుకున్నాయి. ఆటోమొబైల్‌, ఐటీ, విద్యుత్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కొనుగోళ్ల అండతో భారీ లాభాల దిశగా సాగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,800 మార్క్‌ను దాటి ట్రేడ్‌ అయ్యింది. చివరి గంటల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడిని  ఎదుర్కొన్నాయి. దీంతో లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది. చివరకు సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 35,658 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 10,773 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమై మళ్లీ 69 మార్క్‌కు చేరువైంది. ప్రస్తుతం రూ. 68.97గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో హిందుస్థాన్‌ పెట్రోలియం, హీరో మోటోకార్ప్‌, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, టీసీఎస్‌ షేర్లు లాభపడగా. సిఎ/-లా, టెక్‌ మహీంద్రా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నష్టపోయాయి.