స్వామికి ఎందుకంత ఇంట్రెస్ట్‌

సునంద కేసుపై థరూర్‌ లాయర్‌ ప్రశ్న

న్యూఢిల్లీ,జూలై7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ముందు హాజరయ్యారు. తన భార్య సునందా పుష్కర్‌ మృతి కేసులో ఆయనకు న్యాయస్థానం సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఇదే కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకున్న పిటిషన్‌ను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, థరూర్‌ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఈ కేసులో విచారణకు సహకరించేందుకు తనను అనుమతించాలనీ, ఇంతకు ముందు నిర్వహించిన విజిలెన్స్‌ ఎంక్వైరీ నివేదికను సమర్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ స్వామి ఢిల్లీ కోర్టును కోరారు. దీనిపై థరూర్‌ న్యాయవాది స్పందిస్తూ ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకంత ఆసక్తి ?అని ప్రశ్నించారు. అయితే విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు, ఢిల్లీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా చూసేందుకే తాను ఈ కేసులో సహకరించదల్చుకున్నట్టు స్వామి పేర్కొన్నారు. ఈ నెల 26న సదరు పిటిషన్‌ను పరిశీలించి, స్వీకరించాలా, వద్దా అన్నది ధర్మాసనం తేల్చనుంది.శశథరూర్‌కు గురువారమే ముందస్తు బెయిల్‌ మంజూరైనందున దానిని సాధారణ బెయిల్‌గా మార్పు చేసేందుకు ధర్మాసనం అనుమతించింది. సెషన్స్‌ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినందున.. ఇప్పుడు ఆయన సాధారణ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు..అని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు.కాగా సునందా పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటికే 3 వేల పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసింది. ఐపీసీ 306, 498ఎ సెక్షన్ల కింద శశిథరూర్‌ను నిందితుడిగా పేర్కొంది. అయితే ఈ చార్జిషీట్‌ తప్పులతడక అంటూ శశిథరూర్‌ కొట్టిపారేస్తున్నారు. 2014లో జనవరిలో సునంద పుష్కర్‌ ఢిల్లీలోని ఓ స్టార్‌ ¬టల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ శశిథరూర్‌ అరెస్ట్‌ కాలేదు.