స్వార్థ రాజకీయాలకు పావుగా రోహిత్‌ వేముల ఘటన

రోహిత్‌ తల్లి ప్రకటనపై ఖిన్నుడైన మంత్రి పీయూష్‌ గోయల్‌

రాజకీయ పార్టీల తీరుపై మంత్రి ఆసహనం

న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): విద్యార్థుల మృతి పట్ల కొన్ని విపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. విద్యార్థులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. సెంట్రల్‌ వర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల తల్లి రాధిక వేముల చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఢిల్లీలో మాట్లాడారు. రోహిత్‌ వేముల తల్లి చేసిన ప్రకటనను చదివి తాను ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు మంత్రి చెప్పారు. చాలాపార్టీలు ఆమెను ఓ రాజకీయ పావుగా వినియోగించు కున్నాయని అన్నారు. ఇదెంత వరకు న్యాయమో ఆయా పార్టీలే వెల్లడించాలన్నారు. కేరళకు చెందిన ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసి వేముల కుటుంబాన్ని మోసం చేసిందన్నారు. దళిత విద్యార్థి రోహిత్‌ వేముల మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం 20 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కానీ గతంలో ఆ పార్టీ ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయ్యింది. ఆ ఘటనపై రోహిత్‌ తల్లి రెండు రోజుల క్రితం బహిరంగంగా మాట్లాడారు. ఆ విషయాన్ని అన్ని విూడియా సంస్థలు హైలైట్‌ చేశాయి. ఆ ఘటన పట్ల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా స్పందించారు. విద్యార్థుల మృతిపై కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వేముల కుటుంబం ఆర్థికంగా సరిగాలేదని, వాళ్లను ఆదుకుంటామని చెప్పి, ఇండియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ మోసం చేసిందని మంత్రి చెప్పారు. కేవలం ర్యాలీలకు, ధర్నాలకు మాత్రం వేముల రోహిత్‌ తల్లిని ఆ పార్టీ వాడుకుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా వేముల కుటుంబాన్ని స్టేజ్‌ షోలకు తీసుకువెళ్లినట్లు ఆరోపించారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్‌ ఏం హావిూ ఇచ్చిందన్న అంశం తేలాలని ఆయన ప్రశ్నించారు. వేముల కుటుంబంతో రాజకీయం చేస్తున్న రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాధిక వేములపై వత్తిడి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోందని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ వర్సిటీలో 2016 జనవరిలో రోహిత్‌ వేముల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.