స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న భారతీయ అకౌంట్ల గురించి..

త్వరలో పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తాం
– నల్లధనం అని తేలితే కఠిన చర్యలు తప్పవు
– ప్రస్తుత విధానాలతో విదేశాల్లో డబ్బు దాచుకునే దమ్ము ఎవరికీ ఉండదు
– కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌
న్యూఢిల్లీ, జూన్‌29(జనం సాక్షి) : నల్లధనానికి సంబంధించిన డేటాను ఏడాది చివర వరకు తీసుకువస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల అకౌంట్ల గురించి పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. దానికి సంబంధించి స్విట్జర్లాండ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఏడాది మొత్తానికి సంబంధించిన నల్ల కుబేరుల డేటాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయితే స్విస్‌ బ్యాంకుల్లో ఉన్నది నల్ల ధనమా లేక అక్రమ లావాదేవీ అన్న అంశాన్ని ముందుగానే నిర్ధారించలేమన్నారు. స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము గత ఏడాది 50 శాతం పెరిగినట్లు గురువారం ఓ వార్త వెలుడిన విషయం తెలిసిందే. ఆ సొమ్ము విలువ మొత్తం సుమారు ఏడు వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థికశాఖ ఇంచార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి గోయల్‌.. ఈ అంశంపై శుక్రవారం మాట్లాడుతూ.. ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా స్విట్జర్లాండ్‌లో ఉన్న బ్యాంక్‌ అకౌంట్ల డేటాను తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఎవరైనా తప్పు చేసినట్లు తెలిస్తే, వారికి శిక్ష తప్పదన్నారు. విదేశాల్లో డబ్బు దాచుకునే దమ్ము ఇప్పుడు ఎవరికీ లేదని, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అది సాధ్యమైందని మంత్రి చెప్పారు.