స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి
నిజామాబాద్,నవంబర్17(జనంసాక్షి): స్వైన్‌ఫ్లూ మరొకరిని బలితీసుకుంది. దీంతో కారేగాం క్యాంప్‌నకు చెందిన అలీమాబేగం(42) అనే మహిళ మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు, కుటుంబీకులు తెలిపారు. కారేగాం క్యాంప్‌లో స్వైన్‌ప్లూతో మహిళ మృతి చెందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ సిబ్బంది శనివారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటా తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వరంతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. కోటగిరి మండలంలోని కారేగాం క్యాంప్‌నకు చెందిన అలీమా బేగం వారం కిందట తీవ్ర జ్వరం, తుమ్ములు, దగ్గుతో బాధపడుతుంటే కుటుంబీకులు బోధన్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అప్పటికీ ఆరోగ్య పరిస్థితి కుదుట పడక పోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు అన్నిరకాల రక్త పరీక్షలు నిర్వహించారు. అలీమాబేగంకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని వైద్యులు నిర్దారించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వెంటనే స్వైన్‌ఫ్లూ వ్యాధికి సంబంధించిన వైద్యం అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి అలీమాబేగం శుక్రవారం సాయంత్రం దవాఖానలో మృతి చెందింది. మృతురాలుకు భర్త ఎండీ సలీం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.