హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు : కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత అన్నారు. టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ చేపట్టిన దీక్ష మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గురువారం నాడు కలెక్టరేట్‌ ఎదుట దీక్షాదివస్‌రె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అడుగడుగునా అన్యాయమే జరుగుతుందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శాంతియుతంగా ఉద్యమాలు జరుగుతున్నా అధికారంలో కాంగ్రెస్‌ పార్టీ స్పందించడంలేదని అన్నారు. ఆంధ్రలో తెలంగాణ విలీనం తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తెలంగాణలోని భూములను, నీటిని, ఉద్యోగాలను కోల్పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టిడిపిల మోసం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తెలంగాణ బిడ్డల బతుకు మారుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులకు ఓటు వేయకుండా అడ్డుకుంటేనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆమె జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు గణేష్‌గుప్తా, పోశెట్టి, తెలంగాణ జేఏసి చైర్మన్‌ గోపాలశర్మ, ప్రభాకర్‌, టిఎన్‌జివ్సో జిల్లా కార్యదర్శి కిషన్‌ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.