హాంబన్‌టోటలో చిత్తుగా ఓడిన టీమ్‌ఇండియా
హాంబన్‌టోట:భారత జట్టుపై శ్రీలంక జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం హాంబన్‌టోటా వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 1-1 తో సమం చేసింది. భారత బ్యాట్స్‌మన్‌లో ఓపెనర్ గంభీర్ మినహా మిగిలిన వారంతా చెత్తగా ఆడటంతో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఏమాత్రం ఆలోచన లేకుండా పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా గంభీర్ (65), సెహ్వాగ్ (15) బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరు ఓపెనింగ్ బాగస్వామ్యంగా 31పరుగులు జోడించిన క్రమంలో పెరెరా బౌలింగ్‌లో సెహ్వాగ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి బారత వికెట్ల పతనం ఆరంభమైంది. టాపార్డర్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. తొలి వన్డే సెంచరీ హీరో విరాట్ కోహ్లి తుస్సుమనిపించాడు. విరాట్ కేవలం ఒకే ఒక్క పరుగు చేయగా, రోహిత్ శర్మ మరోమారు విఫలమై డకౌట్‌గా పెవిలియకు చేరాడు. వెనువెంటనే సురేష్‌రైనా కూడా ఒక్క పరుగు చేసి పెరారే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 7.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 41పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని ఓపెనర్ గంభీర్‌కు కాస్త సహకారం అందిచ్చాడు. అయితే ధోని కూడా 11 పరుగులు చేసి అవుట్ కాగా, పఠాన్ 6పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ ్‌స్కోరు 19.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 79పరుగులు చేసింది. పఠాన్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బౌలర్ అశ్విన్ కుమార్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు 21పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత జహీర్‌ఖాన్ (2), ఓజా (5) ఇలా వచ్చి అలా వెళ్ళారు. ఒంటరి పోరాటం చేసిన గంభీర్ 65పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 33.3 ఓవర్లలో 138పరుగుల వద్ద ముగిసింది. లంక బౌలర్లలో మలింగా రెండు వికెట్లు తీయగా, పెరారే, మ్యాథ్యూలు తలా మూడేసి వికెట్లు, హెరాత్ ఒక్క వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత 139పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో విజయలక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు తరంగ (59), దిల్షాన్ (50)లు అర్థసెంచరీలతో రాణించారు. దీంతో శ్రీలంక జట్టు ఘనవిజయం సాధించింది.