హామీతో దీక్షల విరమణ
కడప, జూలై 19: కడప నగర శివార్లలోని ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం విరమించారు. డిఆర్‌ఓ హేమసాగర్ హామీ ఇవ్వడంతో దీక్షలు విరమిస్తున్నట్లు సిపిఎం నాయకుడు రవిశంకర్ రెడ్డి చెప్పారు. నగర శివార్లలోని ఆర్‌కేనగర్, తిలక్‌నగర్, ఇందిరమ్మ కాలనీ, సుందరయ్యనగర్, ఆజాద్ కాలనీ, తదితర కాలనీల ప్రజలు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి కడప నగరంలోకి వచ్చి రేషన్ పొందాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారణంగా కార్డు లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఈ ప్రాంతాల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని తాము ఈ దీక్షలు చేపట్టామన్నారు. డిఆర్‌ఓ తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్షలు విరమిస్తున్నామని చెప్పారు.